Harish Rao | రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారని ఆరోపించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. మాట తప్పినందుకు రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. కేటీఆర్ ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా.. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే తన శక్తియుక్తులను ఉపయోగించి హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ రేసును తీసుకువచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి మాత్రం ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించమని తేల్చిచెబితే.. తెలంగాణలో నిర్వహించి ఈ దేశ పరువు, రాష్ట్ర పరువు తీశాడని విమర్శించారు. అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్‌ను తెచ్చి రాష్ట్ర గౌరవం పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. ఎవరూ ముందుకు రాని అందాల పోటీలు నిర్వహించి పరువు తీసింది రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, లఘుచర్ల రైతులకు బేడీలేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని.. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్‌ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.