హైదారాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుక నిరాకరించినట్టు తెలిసింది. మూడురోజులపాటు ఢిల్లీలో పడిగాపులు పడినా సీఎంకు ఆయన దర్శనం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించనున్న కొత్త రేషన్‌కార్డుల పంపిణీ సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ద్వారా ప్రయత్నించినా..రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదు. ‘ఇప్పుడు కాదు..మరెప్పుడైనా చూద్దాం’ అంటూ రాహుల్ తిరస్కరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధినేత తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన రేవంత్‌రెడ్డి ఢిల్లీ షెడ్యూల్‌ను కొంత రద్దు చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కేంద్ర మంత్రులను కలిసేందుకు నిమిషాల మీద అపాయింట్మెంట్లు దొరుకుతున్నా.. పార్టీ అధినేతను కలిసే భాగ్యం మాత్రం దొరకకపోవటంతో సీఎం శిబిరంలో ఆందోళన నెలకొన్నది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీని నడుపుతున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యనేతతోపాటు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని, పార్టీని పూర్తిగా వదిలేశారని ఖర్గే సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీ కోసం కార్యకర్తలు త్యాగాలు చేస్తేనే మీరు అధికారం అనుభవిస్తున్నారని, అటువంటి వారికి 18 నెలలుగా కనీసం నియోజకవర్గం స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ, ప్రభుత్వం ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ అంతర్గత విభేదాల వల్లనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేకపోతున్నామని సీఎం ఖర్గే ముందు నిస్సహాయతను వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో మ రింత అసహనానికి గురైన ఖర్గే అంతర్గత విభేదాలపై నివేదికలు, ఆధారాలతో ఢిల్లీకి రావాలని ఆదేశించినట్టు తెలిసింది.
ఈసారి రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ పక్కా అనే ధీమాతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కడే ఢిల్లీ వెళ్లారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. వాస్తవానికి ఆయన వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్లా ఉండే. అయితే రాహుల్‌గాంధీని రేవంత్ కలిసినప్పుడు మంత్రి ఉత్తమ్ కూడా ఉంటే ఇతరుల మీద ఫిర్యాదు చేసే అవకాశం సీఎంకు ఉండదనే ఆలోచనతోనే వెంట తీసుకువెళ్లలేదని ఉత్తమ్ సన్నిహితవర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో జరిగిన పరిణామాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. సీఎం ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవాలి. బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల ప్రతిని సీఆర్ పాటిల్‌కు అందించి, మరోసారి ప్రభుత్వం తరఫున అభ్యంతరం తెలపాలని అనుకున్నట్టు సమాచారం. కేంద్ర జల్‌శక్తి మంత్రి సోమవారం మధ్యాహ్నమే అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో నీటిపారుదలశాఖ అధికారుల నుంచి బ్రీఫ్నోట్తోపాటు, మంత్రివర్గం నిర్ణయాల నివేదికతో సీఎం ఢిల్లీ వెళ్లినట్టు సీఎంవో వర్గాలు చెప్తున్నాయి.
అంతర్గత విభేదాలకు సంబంధించి పార్టీ వ్యూహకర్త నివేదిక, టీపీసీసీ అధ్యక్షుని నివేదికతోపాటు వివిధ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించిన సమాచారంతో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసింది. తనతో విభేదిస్తున్న అసలు కాంగ్రెస్ నేతలు, ప్రధానంగా తనకు పంటి కింద రాయిలా తయారైన దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్ మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులు, ఆధారాలను తనతో ఢిల్లీ తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సదరు మంత్రి శాఖలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగినట్టు ఆధారాలను కూడా తీసుకొని వెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ ఒక్క మంత్రికి ముకుతాడు వేయగలితే.. మొత్తం మంత్రివర్గం తన చెప్పు చేతల్లో ఉంటుందన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.