సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 30: సీఎం రేవంత్‌రెడ్డికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని, మనుషులు బతుకుడు ముఖ్యమా? సుందరీకరణ ముఖ్య మా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణతో ఎవరి బతుకులు బాగు పడతాయని ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కుటుంబాలను ప్రభుత్వం ఆగం చేస్తున్నదని, లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వం హైడ్రా పేరిట డ్రామాలు ఆపాలని అన్నారు. 56 మంది ఆటో కార్మికులు చనిపోతే ప్రభుత్వ పెద్దలు ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదని, ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదని తెలిపారు. చనిపోయిన ఆటో కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బుల్డోజర్ రాజ్‌ను నిరోధించేలా సీఎం రేవంత్‌రెడ్డికి సూచించాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రంలో దుర్మార్గపాలన సాగుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తున్నదని పేర్కొంటూ రాహుల్‌గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొకి అణచివేస్తున్నదని దుయ్యబట్టారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో సోమవారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శమని ఉదహరించారు.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ ఎలా బుల్డోజర్లను ఉపయోగించిందో తెలంగాణలో కాంగ్రెస్ కూడా అలాగే ఉపయోగిస్తున్నదని హరీశ్ ఉదహరించారు. బుల్డోజర్ విషయంలో రేవంత్‌పాలన బీజేపీ దారిలో నడస్తున్నదని విమర్శించారు. బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు తీర్పు ఉన్నా కనీస సర్వేలు కూడా చేయకుండా సరైన విధానాలను అనుసరించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల ఇండ్లను బుల్డోజ్ చేస్తూ వారిని నిరాశ్రయులను చేస్తున్నదని వివరించారు. ‘సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను గౌరవించే విధంగా ముఖ్యమంత్రికి సలహా ఇవ్వండి’ అని సూచించారు. రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
సుప్రీంకోర్టు తీర్పును కాదని, రాష్ట్ర ప్రభుత్వం రూల్ ఆఫ్ లాకు విరుద్ధంగా వెళ్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు అనేది లా ఆఫ్ ది ల్యాండ్‌గా భావించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్, రైల్వే, నది, చెరువు అంతర్భాగాలు అక్రమించుకున్న వాటిని మినహా ఏ ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినట్టు గుర్తు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లో వాటిని ఎదుర్కొవాల్సివస్తుందని హెచ్చరించారు.