హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర సర్కారును (Maharashtra) సంప్రదించిందీ లేదు. ఆ రాష్ట్రంతో కొత్తగా ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదు. తమ్మిడిహట్టి (Tummidihatti) వద్ద బరాజ్‌ను ఏ ఎత్తులో నిర్మించాలనే అంశంపైన స్పష్టత రాలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ్మిడిహట్టి-సుందిళ్ల ప్రాజెక్టును చేపట్టేందుకు అత్యుత్సాహం చూపుతున్నది. 80 టీఎంసీలను తమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు మళ్లించేందుకు డీపీఆర్ తయారీ కోసం ఏకంగా రూ.11.88 కోట్లతో పరిపాలనా అనుమతులనే మంజూరు చేసింది. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రీతిలో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ప్రాజెక్టును రూపొందించి పనులు చేపట్టి, మొబిలేషన్ అడ్వాన్స్‌ల పేరిట ఆనాటి కాంగ్రెస్ పాలకులు నిధులను స్వాహా చేశారు. నేడు మళ్లీ అదే తరహాలో ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతున్నారని ఇంజినీర్ వర్గాలే మండిపడుతున్నాయి. రూ.891 కోట్లను ఆనాటి కాంగ్రెస్ సర్కారు ఖర్చు చేసిం ది. 71 కి.మీ. మట్టి కాలువలను తవ్వి నాడు కాంగ్రెస్ పాలకులు జేబులు నింపుకున్నారు. అదే తరహాలో ఇప్పటి పాలకులు కూడా నిధుల దోపిడీ కోసమే ఈ హడావుడి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభు త్వం ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు చేపట్టింది. కేసీఆర్ స్వయంగా వెళ్లి నాటి, ప్రస్తుత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపారు. ముంపు పరిహారం ఎంతయినా చెల్లిస్తామని బరాజ్ నిర్మాణానికి అంగీకరించాలని కోరారు. అయినా మహారాష్ట్ర 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి ససేమిరా అన్నది. కేవలం 148 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికే మహారాష్ట్ర సర్కారు అంగీకరించింది. దీంతో చేసేదేమీలేక తెలంగాణ ప్రభుత్వం సైతం ఆ మేరకు తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే బరాజ్ కుదింపు వల్ల ప్రాజెక్టులో ప్రతిపాదిత 160 టీఎంసీలను మళ్లించుకోలేని దుస్థితి ఏర్పడింది. బరాజ్ ఎత్తు 148 మీటర్లకు కుదించడం వల్ల 2.55 మీటర్ల మేరకు వాటర్ హెడ్ తగ్గిపోతుంది. డైవర్షన్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ హెడ్‌తో 150 రోజులపాటు నిరాటంకంగా నీటిని మళ్లించుకున్నా గరిష్ఠంగా 44 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని పరిస్థితి.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మళ్లీ ప్రాణహిత నుంచే జలాలను తరలిస్తామని చెప్తున్నది. బరాజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని నమ్మబలుకుతున్నది. ప్రస్తుత 148 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో కాకుండా 150 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో, లేదంటే కనీసం 149 ఎఫ్ఆర్ఎల్కైనా మహారాష్ట్ర సర్కారును అంగీకరింపజేస్తామని నమ్మిస్తున్నది. 150 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో అయితే 119 టీఎంసీలు, 149 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో గరిష్ఠంగా 80 టీఎంపీల నీటిని మళ్లించుకోవచ్చు. కానీ, 148 ఎఫ్ఆర్ఎల్ అయితే 44 టీఎంసీలు కూడా గగనమే. కానీ ఇప్పటివరకు మహారాష్ట్ర సర్కారుతో ఆ దిశగా చర్చలు జరపనేలేదు. ఎలాంటి ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపనూలేదు. మహారాష్ట్ర అభిప్రాయాన్ని కోరనూలేదు. తెలుసుకోనూలేదు. కానీ గతంలో మాదిరిగానే ఏకపక్షంగా బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను నిర్ణయించి, ఆ మేరకు జలాలను తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా, కొత్తగా సుందిళ్లకు మళ్లించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు డీపీఆర్‌ను తయారు చేయాలని ఇంజినీర్లను ఇప్పుడు ఆదేశించడం గమనార్హం. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌కు జలాలను మళ్లించేందుకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి 2 ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తమ్మిడిహట్టి -సుందిళ్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అందుకోసం తాజాగా రూ.11.88 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.