హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రైతుబంధుపై సీఎం రేవంత్‌రెడ్డి హామీని విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రైతుబంధు అంశంపై శాసనమండలిలో మాట్లాడిన కవిత సీఎం రేవంత్ దేవుళ్లపై ప్రమాణం చేసి హామీని మరిచారని మండిపడ్డారు. హామీని గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆకుపచ్చ కండువాలతో శాసనసభ, మండలికి వచ్చినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి 2024 ఏప్రిల్ 20న ఏడుపాయల దుర్గమ్మపై, 21న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై, 22న బాసర సరస్వతి అమ్మవారిపై, 23న జోగులాంబ అమ్మవారిపై, 24న రామప్ప శివయ్య మీద, మే 9న ఆర్మూర్ సుద్దలగుట్ట దేవుడిపై ప్రమాణం చేసి, రైతుబంధుపై హామీ ఇచ్చారని వెల్లడించారు. దేవుళ్లపై ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి హామీని నెరవేర్చకపోవడంపై నిరసన తెలియజేస్తున్నామని కవిత తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ): కొత్త జిల్లాల ఏర్పాటు మేరకే 317 జీవో తీసుకువచ్చామని, అందులో సమస్యలుంటే ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించవచ్చని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 317 జీవోపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 317 జీవోను నాడు విమర్శించిన కోదండరాం, ఇప్పుడు రెండు, మూడు జిల్లాలపై మాత్రమే ప్రభావం పడిందని చెప్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కోదండరాం మాట్లాడుతూ జీవో కారణంగా అన్ని జిల్లాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, దీనికి కారణం 317(డీ) క్లాస్‌ను ప్రస్తావించకపోవడమేనని తెలిపారు. జోనల్ వ్యవస్థపై శాస్త్రీయత లోపించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన వారే స్థానికత కోల్పోవాల్సి వచ్చిందని సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మార్పులు చేయడమే 317 జీవో వివాదాలకు శాశ్వత పరిష్కారమని స్పష్టంచేశారు. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ప్రస్తుతం 317 జీవో రద్దు చేద్దామన్నా కొత్త సమస్యలు వచ్చే అవకాశమున్నదని వివరించారు. ఇప్పటికే దీనిపై సీఎం సబ్‌కమిటీ వేశారని, పలు సమస్యలను పరిష్కరిస్తూ ఈ కమిటీ ముందుకెళ్తున్నదన్నారు. ఇప్పటికే ఈ జీవోకు సంబంధించి వందల దరఖాస్తులు పరిష్కరించామని చెప్పారు. మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ జీవోతో కొన్ని లాభాలు ఉన్నాయని, అయితే దీనిని కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.