హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘పది నెలల పాలనా కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి పేద, మధ్య తరగతి ఇండ్లను కూల్చుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఇకనైనా కూల్చుడు బంద్ పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టు’ అని శాసమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. హైడ్రాకు కర్త, కర్మ, క్రియ రేవంత్‌రెడ్డేనని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే దీనిని తెచ్చి ప్రజలను బాధపెడుతున్నారని విమర్శించారు. మొన్న హైడ్రా, నిన్న మూసీ, ఇప్పుడు ఫోర్త్‌సిటీ పేరుతో డైవర్షన్ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. పది నెలలుగా రాష్ట్రంలో పాలన పడకేసిందని విమర్శించారు.
దవాఖానల్లో మందులు కరువయ్యాయని, గురుకులాల్లో మెస్సులు లేవని దుయ్యబట్టారు. మహాలక్ష్మి స్కీం కింద తెచ్చిన ఉచిత బస్సు పథకం తుస్సుమన్నదని విమర్శించారు. పంటకాలం పూర్తవుతున్నా రైతు భరోసా ఊసే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తులం బంగారం, నాలుగువేల పింఛన్ మాటే ఎత్తడం లేదని నిప్పులు చెరిగారు. సోమవారం ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎల్ రమణ, నవీన్‌రెడ్డితో కలిసి అసెంబ్లీహాల్లో విలేకరులతో మధుసూదనాచారి మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలతో మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే శుభకార్యాలతో మొదలు పెట్టాలని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి కూల్చివేతలను ప్రారంభించారని విమర్శించారు. హైడ్రా కూల్చివేతలను హైకోర్టుతో పాటు ప్రతిఒక్కరూ తప్పుపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం హైడ్రాకు దారితెన్ను తెలియడంలేదని విమర్శించారని గుర్తుచేశారు. రేవంత్ వ్యవహారం ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ పాలన అంటే పేదలపై దౌర్జన్యానికి దిగడమేనా? అని మధుసూదనాచారి ప్రశ్నించారు. 1976లో ఇందిరాగాంధీ ఢిల్లీలో తుర్క్‌మన్ గేటులో పేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కించి అడ్డొచ్చిన పది మంది పేదల ప్రాణాలు తీశారని గుర్తుచేశారు. 2008లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం భీంరావువాడ బస్తీవాసులపై ఇలాగే దౌర్జన్యకాండకు దిగిందని విమర్శించారు. ఇప్పుడు అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను కూల్చివేస్తూ ప్రభుత్వమే ప్రజలకు సమస్యగా మారిందని చెప్పారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు రేవంత్‌ను తిట్టని తిట్లు తిడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు వారు కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
‘రేవంత్‌రెడ్డి కూల్చివేతలను ఆపకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.. ఖబర్దార్’ అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆవేదనను, ఆవేశాన్ని డబ్బుతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పిచ్చిపిచ్చి విమర్శలు మాని, ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుంటే ప్రజల ఆవేదన తెలుస్తుందని సూచించారు. ఎల్ రమణ మాట్లాడుతూ హైడ్రా పేరిట ప్రభుత్వం పేదల గుండెల్లో గునపాలు దించుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కూల్చివేతలు చేస్తుండడంతో బాధితులు భరోసా కోసం తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నారని తెలిపారు. సీఎం తక్షణమే హైడ్రా కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు.