హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తాను చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంది సీఎం రేవంత్‌రెడ్డి ధోరణి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్‌ట్యాపింగ్ నేరం, ఘోరమంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ అసలు తప్పే కాదని తేల్చేశారు. తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నదని పరోక్షంగా అంగీకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్లు వింటున్నది, ట్యాప్ చేస్తున్నదంటూ ఎన్నికల ముందు, తర్వాత బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి చేయని దుష్ప్రచారం లేదు, పెట్టని కేసు లేదు. ఒకవిధంగా బీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
కానీ అప్పుడు తప్పనిపించిన ఫోన్‌ట్యాపింగ్.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో ఆయనకుతప్పుకాదనిపిస్తున్నది. ఫోన్‌ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని, తప్పుకాదని ఆయనే స్వయంగా వెల్లడించారు. కాకపోతే అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుందని సెలవిచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిగజారుడు రాజకీయాలు చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు తప్పు కానప్పుడు…అప్పుడెలా తప్పవుతుంది ?
ఫోన్‌ట్యాపింగ్ తప్పుకాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించడంతో గతంలో ఆయన చేసిన ఆరోపణలపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఫోన్‌ట్యాపింగ్ చేయడం ఇప్పుడు తప్పు కానప్పుడు అప్పుడెలా తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అప్పుడు కూడా ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేసింది తప్ప వ్యక్తిగతంగా ఎవరూ చేయలేదు. ఆ వివరాలను కూడా ఎక్కడా బహిర్గతం చేయలేదు. ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదంటే దీనికి సహజంగానే అనుమతి ఉంటుంది. అనుమతి తీసుకొని ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పులేదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల ప్రకారం ఆనాడు ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ కూడా తప్పుకాదని తేలిపోయింది.
వాస్తవానికి సంఘ విద్రోహశక్తులు, ఉగ్రవాదులు, డ్రగ్స్ రవాణాదారులు, తీవ్రవాదులు ఇలా విద్రోహశక్తుల నుంచి రాష్ర్టాన్ని, దేశాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాల ప్రభుత్వాల పాలనలో ఫోన్‌ట్యాపింగ్ ఒక భాగం. కానీ దీన్ని ఏదో పెద్ద తప్పు కింద చిత్రీకరించి.. దీనికి రాజకీయరంగు పులిమిన రేవంత్‌రెడ్డి ఎన్నికల అస్త్రంగా వినియోగించారనే విమర్శలున్నాయి. వాస్తవానికి ఫోన్‌ట్యాపింగ్ తప్పుకాదనే అంశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అప్పుడు కూడా తెలుసని, కానీ ప్రజల్లో బీఆర్ఎస్ను, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు అసలు విషయాన్ని దాచేసి తప్పుడు ప్రచారం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారులను బలిపెట్టారు..క్షమాపణలు చెప్తారా ?
ఓవైపు ఫోన్‌ట్యాపింగ్ తప్పుకాదని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి మరోవైపు ఇదే అంశంపై కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి రాజకీయ కుట్రలో అధికారులు బలైపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్‌ట్యాపింగ్ సాకుతో పలువురు పోలీసు అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు కేసులు బనాయించింది. వారిని జైళ్లలో వేసి.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నది. విచారణల పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నది.
వారిపై ద్రోహుల ముద్రవేయడంతోపాటు మానసికంగా కుంగదీసి.. నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ట్యాపింగ్‌లో పాల్గొన్న అధికారుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దనే నిబంధన ఉంటుంది. ఒకవేళ వారి పేర్లు బయటికొస్తే సంఘ విద్రోహశక్తుల నుంచి వారికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో వారి పేర్లను అత్యంత రహస్యంగా ఉంచుతారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం ఇవేవీ పట్టకుండా అధికారుల పేర్లను బహిర్గతం చేసింది. వారిపై కేసులు బనాయించి జైళ్లలో వేసింది.
దీంతో అధికారులతోపాటు వారి కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురయ్యాయి. రేవంత్‌రెడ్డి సర్కారు చర్యల్ని కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది. అధికారుల పేర్లు బయటపెట్టొద్దని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని కూడా సూచించినట్టు తెలిసింది. అయినా బీఆర్ఎస్పై కోసం, కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతో అధికారులను బలిపెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి. మరిప్పుడు ట్యాపింగ్ తప్పుకాదని చెప్పిన రేవంత్‌రెడ్డి.. అధికారుల విషయంలో చేసింది తప్పేనని ఒప్పుకుంటారా? వారికి, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్తారా? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు అధికారులపై ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడితే దేశ, రాష్ట్ర రక్షణ కోసం నిర్వహించే రహస్య ఆపరేషన్లలో పాల్గొనేందుకు ఎవరు ముందుకొస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టార్గెట్ బీఆర్ఎస్.. రాజకీయ డ్రామా
ఫోన్‌ట్యాపింగ్ తప్పుకాదని సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించడంతో ప్రస్తుతం ఆ అంశంపై కాంగ్రెస్ సర్కారు ఆడుతున్నదంతా రాజకీయ డ్రామా అనేది తేలిపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఉపయోగించి ఇదే అంశంతో బీఆర్ఎస్ను మరింత ఇరుకున పెట్టే పన్నాగానికి తెరలేపారనే అభిప్రాయాలున్నాయి. ఇందులో భాగంగానే కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారంటూ, వాళ్ల ఫోన్లు, వీళ్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ రోజుకో డ్రామాను రక్తికట్టించారు. దీనికితోడు విచారణలు, కేసుల పేరుతో రాజకీయ డ్రామాను మరింత పీక్కు తీసుకెళ్లారనే విమర్శలున్నాయి. ఇప్పుడు సీఎం వ్యాఖ్యలతో ఇదంతా కూడా డ్రామాయేనని, కేసీఆర్‌ను, కేటీఆర్‌ను బద్నాం చేయడానికేనని తేలిపోయింది.
కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాప్…అందుకే ‘తప్పుకాదు’ వాదనా..?
కొద్దినెలలుగా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఇందుకు బలం చేకూర్చేలా అనేక ఘటనలు బయటికొస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న మాటలన్నీ ప్రభుత్వంలోని కీలక నేతకు చేరినట్టు తెలిసింది. ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు సదరు ముఖ్యనేత వద్దకు వెళ్లగా ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటలను పొల్లు పోకుండా చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆవాక్కయిన సదరు మంత్రి తన ఫోన్ ట్యాప్ అయిందని నిర్ధారించుకొని ఇకపై తాను ఫోన్ వాడకూడదని నిర్ణయించకున్నారు.
తన సిమ్ తీసేసిన ఆయన ప్రస్తుతం ఫోన్ వాడటం పూర్తిగా మానేశారు. కాంగ్రెస్‌లోని ఓ కీలక మహిళా నేత ‘మేడమ్’ ఫోన్ సైతం ట్యాప్ అయినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం పార్టీలో, ప్రభుత్వంలో ముసలం పుట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ఫోన్‌ట్యాపింగ్ తప్పుకాదు అనే వాదనను తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఫోన్‌ట్యాపింగ్ తప్పు అంటూ గగ్గోలు పెట్టిన సదరు నేత.. ఇప్పుడు తప్పుకాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.