Revanth Reddy | హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే.. కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండటంతో తాము అన్ని ఉద్యోగాలకు ఒకేసారి చదవలేకపోతున్నామని, నోటిఫికేషన్లు ఆపాలంటూ ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మంగళవారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రైతుభరోసా విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో తమ మొదటి ప్రాధాన్యం రైతులకేనని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కష్టమైనా సరే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసినట్టు తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. 18 నెలల కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉన్నదో బేరీజు వేయాలని, అంతటా చర్చ పెట్టాలని ప్రజలను కోరారు. గోదావరి-బనకచర్లపై అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు. గోదావరి-బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడదామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా తాను, మంత్రి ఉత్తమ్‌కుమార్ దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. ‘బనకచర్లపై ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా?తాను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాడిని కదా? రాజీవ్‌గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని, కాంగ్రెస్‌లో ఎందుకు చేరేవాడిని?’ అని ప్రశ్నించారు. త్వరలోనే రాజీవ్ యువ వికాసం పథకం అమలవుతుందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్యాన్సర్ వ్యాధిలా ఉన్నదని, దివాలా రాష్ట్రంగా మారిందని మరోసారి చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా పంపిణీ పూర్తిచేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాము ఎన్నికల్లో రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చామని, ఆ మేరకు చేశామని పేర్కొన్నారు. ఐదేండ్లలో అన్నీ హామీలు అమలుచేస్తామని, మరోసారి రేవంత్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రు లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైతుభరోసా పంపిణీలో భాగంగా మంగళవారం 15 ఎకరాలకుపైగల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.459.47 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇప్పటివరకు వానకాలం రైతుభరోసా కింద 69.4 లక్షల మంది రైతులకు సంబంధించిన 1.46 కోట్ల ఎకరాలకు రూ.8,744.13 కోట్ల నిధులు జమ చేసినట్టు వెల్లడించారు.