చెప్పులరిగేలా తిరిగినా అపాయింట్మెంట్ ఇవ్వకపోతివి నా భర్త చనిపోయి రెండేండ్లయింది. ఇదే సెప్టెంబర్‌లో మీరిచ్చిన హామీలు ఇంకా మాకు గుర్తున్నయ్. నా బిడ్డలకు అన్యాయం చేయకండి. మీ అపాయింట్మెంట్ కోసం చెప్పులరిగేలా తిరిగినం. జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటికి చాలాసార్లు వచ్చినం. ఒక్కసారి కూడా మీరు కల్వకపోతిరి. మీరిచ్చిన ప్రభుత్వ ఉద్యోగ హామీ నెరవేరలే. నా బిడ్డల ఉన్నత చదువులకు గ్యారెంటీ లేకపాయె. నాకూ ఉద్యోగమిస్తనన్న హామీ గంగలో కలిసింది. కనీసం నా భర్త ఉద్యోగమైనా ఇప్పించాలని డీజీపీ ఆఫీసుకు, ప్రజావాణికి తిరుగుతనే ఉన్నం. ఏ ఒక్కరూ మా గోడు వింటలేరు. రేవంత్రెడ్డన్నా.. మా గోడు వినన్నా. – సంధ్య, హోంగార్డు రవీందర భార్య
2023, సెప్టెంబర్ 8.. హోంగార్డు రవీందర్ ఆత్మహ్యతను నాటి పీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయంగా వాడుకున్న రోజు! ఉస్మానియా దవాఖానలో ధర్నా చేస్తున్న రవీందర్ భార్య సంధ్యకు మద్దతుగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘హోంగార్డు రవీందర్ చావుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆయన ఇద్దరు కొడుకుల ఉన్నత చదువులకు ప్రభుత్వమే సాయం చేయాలి. లేదంటే వచ్చే వందరోజుల్లో ప్రభుత్వం మాదే. అన్నీ మేమే చూసుకుంటాం. హోంగార్డులను పర్మినెంట్ చేస్తాం. ప్రస్తుతం రవీందర్ కుటుంబానికి రూ.2లక్షల పరిహారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం’ అంటూ మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మర్చిపోయారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వాలకు కొన్నేండ్లపాటు సేవలు చేసి తనువు చాలించిన హోంగార్డుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కాఠిన్యం ప్రదర్శిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 800కు పైగా హోంగార్డుల కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం వేయికండ్లతో ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ముందు హోంగార్డుల చావులను రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. తమ భర్తల ఉద్యోగాలు తమకు గాని, తమ కొడుకులకు, కూతుళ్లలో ఎవరికైనా ఇప్పించాలని ఆ తల్లులు తిరగని ఆఫీసులు లేవు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీలు, ఐజీలు, కమిషనర్లు.. ఆఖరికి డీజీపీ కార్యాలయాలు, ప్రభుత్వం గొప్పగా చేపట్టిన ప్రజావాణి ఆఫీసుల చుట్టూ నేటికీ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
అయినా ప్రభు త్వం ఏ మాత్రం కనికరించకుండా కారుణ్య నియామకాలు రద్దు చేస్తూ దొంగచాటుగా ఇటీవల ఉత్తర్వులిచ్చింది. 2023, సెప్టెంబర్ 8న హోంగార్డు రవీందర్ కుటుంబానికి కాంగ్రెస్ తరఫున రూ.2 లక్షల విరాళం ఇస్తామని రేవంత్‌రెడ్డి గొప్పగా ప్రకటించినా నేటికీ ఆ డబ్బులు వారికి అందలేదని బాధితులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేకయకపోగా అసెంబ్లీ జరిగినప్పుడల్లా హౌస్ అరెస్టులు చేసి ఇబ్బంది పెడుతున్న వైనాన్ని వారి ఇంటి చుట్టుపక్కల వాళ్లు పూసగుచ్చినట్టు చెప్తున్నారు.
నాడు ఎన్నికలప్పుడు హోంగార్డులకు సైతం అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకపోగా వందలాది హోంగార్డుల కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇన్నాళ్లూ ఎలాగైనా తమ భర్తల ఉద్యోగాలు తమకో, తమ బిడ్డలకో వస్తాయని ఎదురుచూసిన ఆడబిడ్డల ఆశలు ఆవిరి చేసింది. ఎన్నికల్లో ఇట్లా గెలిచారో లేదో.. అట్ల కారుణ్య నియామకాలు రద్దు చేస్తున్నట్టు గత డిసెంబర్ 30న సర్క్యూలర్ ఇచ్చింది. ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ నోట్లో మట్టి కొట్టిందని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘తాత్కాలిక సేవలు పొందేందుకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మరణించిన తాత్కాలిక ఉద్యోగిపై ఆధారపడిన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఎలాంటి నిబంధనలు లేవు’ అంటూ తెలంగాణ డీజీపీ పేరుతో ఉత్తర్వులు వచ్చాయి. అత్యంత రహస్యంగా ఈ ఉత్తర్వులు వెలువడిన దగ్గర్నుంచి తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక హోంగార్డులు, వారి కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఎన్నికలప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని, 2016 నుంచి మరణించిన 800 మంది హోంగార్డుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇప్పిస్తానని హామీలిచ్చారు. ఇదే విషయమై గత జూలైలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా నెరవేర్చాలని మంత్రి సీతక్కకు హోంగార్డులు వినతిపత్రం ఇచ్చారు. ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణిలో పలు దఫాలుగా తమ గోడు వెల్లబోసుకున్నారు. నాడు హోంగార్డులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని, దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాలు కొనసాగుతున్నా తెలంగాణలో అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ను కాదనుకొని కాంగ్రెస్‌కు ఓటేసినందుకు తగిన బుద్ధి చెప్పారని కన్నీటి పర్యంతమవుతున్నారు.
చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ మాట కూడా తప్పాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 2 కింద మరణించిన హోంగార్డు కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని సర్యులర్ విడుదల చేసింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మరణించిన హోంగార్డులు దాదాపు 50 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకూ వారి కుటుంబాలకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆ 50 కుటుంబాల వాళ్లు పలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నామని, అధికారులను అడిగితే ఇంకా బడ్జెట్ రిలీజ్ కాలేదని చెప్తున్నారని, చనిపోయిన వారికి ఇవ్వాల్సిన రూ.5 లక్షలు కూడా పెండింగ్‌లో పెట్టి ఏం సాధిస్తారని మండిపడుతున్నారు. ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోతే.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
నా భర్త హోంగార్డుగా డ్యూటీ చేస్తూ అనారోగ్యంతో చనిపోయిండు. దవాఖానలో చికిత్స కోసం అప్పులు చేసిన. పెండ్లికెదిగిన బిడ్డ ఉన్నది. నా కొడుకు దివ్యాంగుడు. నేను అనారోగ్యంతో బాధపడుతున్న. కుట్టుమిషన్తోటి కుటుంబం నడుసుడు కష్టమైతాంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి మాకు హామీ ఇచ్చిండ్రు. నా భర్త ఉద్యోగం మా కుటుంబంలో ఎవరికైనా ఇచ్చి మమ్ములను ఆదుకోవాలె.
– మౌనిక, హోంగార్డు రాజు భార్య, మహబూబాబాద్ జిల్లా
నా భర్త మామిడాల శంకర్ క్యాన్సర్‌తో 2025, మేలో చనిపోయిండు. హెల్త్ కార్డు లేక అప్పు చేసి మరీ చికిత్స అందించినం. అయినా మాకు దక్కలేదు. నాకు గుండె సమస్య ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలు. సొంతిల్లు లేదు. ఎలాంటి ఆస్తులు లేవు. శంకర్ చనిపోయిన తర్వాత సొంతిల్లు లేక ఒక చెట్టు కింద నీడ ఏర్పాటు చేసుకున్నం. ఇప్పుడు భూపాలపల్లిలో అద్దెకుంటున్నం. అద్దె కూడా కట్టలేని దీనస్థితిలో ఉన్నం. నా కూతురికి హోంగార్డు ఉద్యోగం ఇప్పించి న్యాయం చెయ్యిండ్రి.
– విజయలక్ష్మి, హోంగార్డు శంకర్ భార్య
ఇద్దరు ఆడబిడ్డలన్ని పోషణ కష్టమైతాంది. రోజులకు రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయినం. ఏ ఒక్క అధికారి కూడా మాకు సాయం చెయ్యలే. ఇప్పటికైనా మా గోడు వినుండ్రి. నా భర్త ఉద్యోగం ఇప్పించుండ్రి. బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్న. ప్రజావాణికి కూడా వచ్చినం. ఉద్యోగం వస్తుందని చెప్పిండ్రు కానీ ఇవ్వలే. నా భర్త ఉద్యోగం నాకు కావాలె. పెరిగిన ధరలతో చాలా ఇబ్బందులు పడుతున్నం. మాపై ముఖ్యమంత్రిగారు దయచూపాలె.
– ఫైర్ హోంగార్డు భార్య, హుస్నాబాద్