Minister Harish Rao | వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మారారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. జహీరాబాద్, సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతులు రాయిగా మారింది. కరెంటుపై ఎంత చర్చ జరిగితే అంతగా బీఆర్ఎస్కు లాభమన్నారు. తెలంగాణను ముంచే పోలవరానికి ముగ్గుపోసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.
వ్యవసాయానికి 3గంటల విద్యుత్ చాలని రేవంత్ తననైజాన్ని చాటుకున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనలో, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎలా ఉందో రైతులకు తెలుసునన్నారు. తొమ్మిదేళ్లలో ఎప్పుడైనా అసెంబ్లీలో కరెంటు కష్టాల గురించి మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. ఎవరూ ప్రస్తావించడం లేదంటే కరెంటు బాగుంటేనే కదా అర్థమన్నారు. 3 గంటల కరెంటు, 24 గంటల కరెంటు ఎలా ఉంటుందో రైతులకు తెల్వదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలతో గోసపడిన విషయం రైతులు మరువలేదన్నారు. తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తుందన్న విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు.
తెలంగాణ తరహా అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు కావాలంటున్నాయన్న హరీశ్‌రావు.. రాష్ట్రం రాక ముందు తెలంగాణ ఎలా ఉంది? నేడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేస్తామని ఆనాడు కాంగ్రెస్ గెలిచి మాటతప్పిందని, కేసీఆర్ పాలనలోనే తండాలుగా గ్రామ పంచాయతీలుగా మారాయన్నారు. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేసి, జహీరాబాద్ నియోజకవర్గంలో లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయ్యిందని, వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. పాత, కొత్త నేతలు కలిసి గులాబీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.