కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొనిరావాలనే సంకల్పంతో ఉన్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తాం.ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకొని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించాం. మరమ్మతులకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబర్ దాకా చేయాల్సిన పనులపై షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించాం.
– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి.. వాతావరణ శాఖ చేసిన కరువు హెచ్చరికల నేపథ్యంలో ఇక తప్పదన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు శరణు జొచ్చారు. తెలంగాణ వ్యవసాయానికి జీవనాడిగా నిలిచి, జల యుద్ధంలో గాయపడ్డ తల్లి మేడిగడ్డను హేళన చేసిన అపరాధభావం వెంటాడిందో ఏమో కానీ, సోమవారం ముందుగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వాములను దర్శించుకొన్నారు. ముక్తేశ్వరస్వామికి మోకరిల్లి, కాళేశ్వరస్వామిని క్షమాపణ అడిగి మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొనిరావాలనే సంకల్పంతో ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మీడియా ముందు ఈ ప్రకటన చేస్తున్నప్పుడు.. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కప్పిపెట్టానన్న అపరాధ భావన ఆయన ముఖంలో తొంగి చూసింది. వానకాలంలోపు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఇంజినీరింగ్ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లకు మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకొనిరావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ముందే నిపుణులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి.. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్ ) ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వానకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్ఎస్, బరాజ్‌ల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్ సంస్థలతో బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడిగడ్డ దగ్గర 500 బోరుబావులు తవ్వాల్సి ఉన్నదని నిపుణులు పేరొనగా.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకొని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. మరమ్మతులకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబర్ దాకా చేయాల్సిన పనులపై షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు.
7వ బ్లాక్‌లో 20,21,22 పిల్లర్లు మాత్రమే కుంగుబాటుకు గురయ్యాయని, ఎన్డీఎస్ఏ సలహాలతో ఈ పిల్లర్లకు మరమ్మతు చేస్తే ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందని కేసీఆర్ మొదటి నుంచీ చెప్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని కేసీఆర్ చెప్తూనే వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 21 భారీ పంపుహౌస్‌లు, 19 సబ్స్టేషన్లు, 85 పిల్లర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 13 జిల్లాకు తాగు, సాగునీరు అందించే బహుళార్ధక సాధక ప్రాజెక్టు అని దీనిపై రాజకీయం చేయొద్దని ఆయన అప్పుడే సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెడుతున్నదని, కావాలనే ప్రాజెక్టును దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. తాము అద్భుతంగా నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిలువునా ముంచుతున్నదని విమర్శించారు. పంపులను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని, శాస్త్రీయ పద్ధతిలో రిపేర్లు చేస్తే ప్రాజెక్టును కాపాడుకోవచ్చని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 20 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందిందని, కొద్దిపాటి రిపేర్ చేస్తే 141 టీఎంసీల జలం నిల్వ ఉంటుందని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన అనుభవాన్ని అనేకసార్లు శాసనసభలో, శాసనసభ బయట వివరించారు. అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఇంకో అడుగు ముందుకు వేసి, కాళేశ్వరం ప్రాజెక్టును తమకు (బీఆర్ఎస్ పార్టీకి) అప్పగిస్తే.. ఆరు నెలల్లోనే రిపేర్ చేసి, మళ్లీ యథావిధిగా నీళ్లు అందిస్తామని హరీశ్‌రావు చెప్పారు.
నిన్నమొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదంటూ విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రెండున్నరేండ్ల అనంతరం దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టుగానే 7వ బ్లాక్‌లో ఒక్క పిల్లర్ కొంచెం ఎక్కువగా, మరో రెండు పిల్లర్లు పాక్షికంగా కుంగిపోయాయని తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇవే పిల్లర్లకు మరమ్మతులు చేస్తున్నది. ఈ పనులనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం మీడియా ముందు, బహిరంగ సభలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూనే ఆ ప్రాజెక్టు కట్టించిన కేసీఆర్‌పై మరోసారి రోత కూతలతో విరుచుకుపడ్డారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు అందించలేదని, లక్ష కోట్లు దిగమింగారంటూ ఎప్పటిలాగే అబద్ధాల ప్రచారం సాగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును, దానిని కట్టించిన కేసీఆర్ సర్కార్‌ను బద్నాం చేసేందుకు, ఈ అపూర్వ ప్రాజెక్టును పడావు పెట్టేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నించిన తానే.. చివరికి వేరే దిక్కులేక, దాని ప్రాధాన్యాన్ని కాదనలేని పరిస్థితుల్లో రిపేర్ చేయించాల్సి వస్తున్నదన్న ఫ్రస్టేషన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఊగిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు అందించనప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే ప్రాజెక్టును ఎందుకు మరమ్మతులు చేయిస్తున్నారనేది ప్రజలు సంధిస్తున్న ప్రశ్న.