హైదరాబాద్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): యాసంగికి సంబంధించి రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషితో సీఎం, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. యాసంగిలో ఉత్పత్తి అయ్యే ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.
యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్(5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సేకరణకు సంబంధించి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఇటీవల నిలిపేసిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని తిరిగి ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.