కన్నుమిన్నూ కాననితనం.. ఏడాదిగా పాలన చేతగాక రాష్ర్టాన్ని పెంట పెంట చేసింది చాలక.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని గత ఏడాది కాలంగా మూర్ఖంగా కుట్రలు చేస్తూనే ఉన్నది. అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అన్నారు. తర్వాత జన్వాడ ఫాంహౌస్ అన్నారు. ఇంకోసారి డ్రగ్స్ కేసు అన్నారు. తొత్తు మీడియాతో ఏదో జరిగిపోయినట్టు ప్రచారాలు చేయించారు. అయినా ఎక్కడా ఏం దొరక్క జుట్టు పీక్కున్నారు. ఆఖరికి మహిళా మంత్రిని ఎదుట పెట్టి సభ్యసమాజం తలదించుకునేలా రోత మాటలు మాట్లాడించారు. నీలాపనిందలు వేశారు. చివరికి లగ చర్ల కేసులో ఇరికించాలనిచూశారు. అయినా ఏమీ చేయలేక ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసు అంటున్నారు.
ఏంటా ఫార్ములా-ఈ రేసు కేసు?.. అది హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఉంచిన మంచి నిర్ణయం. ఈ ఒప్పందంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదు. ఎక్కడా అవినీతీ జరుగలేదు. ఎవరికీ కమీషన్లు చెల్లించలేదు. పైగా ఇది కేటీఆర్‌కు వ్యక్తిగతంగా ఏ చిన్న ప్రయోజనం చేకూర్చేదీ కాదు. ఒక మంత్రిగా తన రాష్ట్రం కోసం, రాజధాని ప్రతిష్ఠ కోసం తపనతో చేసిన నిర్ణయం. ఇదేం దొంగచాటు ఒప్పందం కాదు. బాజాప్తా బ్యాంకు ద్వారా నగదు బదిలీ జరిగింది. సమాచార లోపం కారణంగా ఓ చిన్న సాంకేతిక ఇబ్బంది తలెత్తితే దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు.
ఫ్యాక్షనిస్టు మనస్తత్వాన్ని నిలువునా నింపుకున్న సర్కారు కేసుల కుట్రకు తెరలేపింది. తానే రద్దు చేసిన ‘ఈ ఫార్ములా’ రేస్ మీద తిరిగి కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది. పరిపాలన చేతగాక అరెస్టులు, కేసులతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఎంతోకాలం సాగవని లగచర్ల రైతులకు బెయిల్‌తోనే స్పష్టమవడం లేదూ!
రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకెళ్తం. ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడుతం. ముఖ్యమంత్రి ఎన్నిరకాల అటెన్షన్ డైవర్షన్ పనులు చేసినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటం.
Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ కుటిల ప్రయత్నంతో ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కేసు నమోదైంది. ఈ-కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగంతో కేటీఆర్‌పై ఎంఏయూడీ సెక్రటరీ దానకిశోర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఇప్పటికే పథకం ప్రకారం గవర్నర్ అనుమతి సైతం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐఏఎస్ దానకిశోర్‌తో ఫిర్యాదు చేయించి, అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని మంగళవారం సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో బుధవారం సాయం త్రం ఎంఏయూడీ సెక్రటరీ దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ తెలిపారు.
ఎన్నికల నియమావళిని ధిక్కరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రూ.54,88,87,043 కోట్లను యూకేకు చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్’ (ఎఫ్ఈఓ) కంపెనీకి హిమాయత్‌నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి బదిలీ చేయించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్ఎస్) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్ 409, 120 (బీ) సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థికశాఖ అనుమతి అవసరమని, సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేక పోవడంతో హెచ్ఎండీఏ నిధులు మళ్లించారని, దీంతో విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్ఎండీఏకు అదనపు పన్ను భారమైందని దానకిశోర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్ సహా ఇతర అధికారులను విచారించేందుకు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ బంజారాహిల్స్‌లోని కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా బృందాన్ని విచారణ కోసం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ టీమ్‌లో పది మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విచారణ వివరాలు ఎప్పటికప్పుడు ఏసీబీ ఉన్నతాధికారికి, వారి నుంచి ప్రభుత్వానికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కేటీఆర్‌కు త్వరలోనే విచారణ నోటీసులను ఏసీబీ అధికారులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు ఈ-కార్ రేస్ గురించి వాస్తవాలు వెల్లడించడంతో ఆయనను అక్రమంగానైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పలు అక్రమ అరెస్టులతో ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో కేటీఆర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముగిసిన వెంటనే నోటీసులు అందజేస్తారని సమాచారం.