హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : పార్టీ కోసం త్యాగం చేసిన ఎగువ శ్రేణి కాంగ్రెస్ నాయకత్వానికి మరోసారి మొండిచెయ్యే చూపించడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. కీలకమైన కార్పొరేట్ పదవులను మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలకి కట్టబెట్టి, వారిని సంతృప్తిపరచాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిని ఆర్టీసీ చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. గతంలోనే శాసనసభ అంచనా పద్దుల కమిటీ చైర్మన్‌గా పదవి కట్టబెట్టినా ఆమె స్వీకరించని విషయం తెలిసిందే. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చైర్మన్ లేదంటే ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ప్రకటించే అవకాశాలున్నట్టు వినికిడి.
వీరితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టేందుకు నిర్ణయించి అందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 27న 62వసారి ఢిల్లీకి వెళ్తున్నారని సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ తదితరులు ఆయన వెంట వెళ్తారని, 28న కూడా సీఎం ఢిల్లీలోనే పార్టీపెద్దలను కలిసిన తర్వాత సుమారు 25 కార్పొరేషన్ పదవులు ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.