ఖైరతాబాద్, జూన్ 9: ఏపీ జలదోపిడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను మింగినా ఆంధ్రప్రదేశ్ పాలకులకు దాహం తీరలేదని, గోదావరి జలాలను కూడా మింగే ప్రయత్నం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రజానీకం అప్రమత్తంగా లేకపోతే హక్కులను కోల్పోవాల్సిన దుస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి 2023 వరకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి నీటి విషయంలో తెలంగాణ హక్కులను కాపాడడంలో నిబద్ధతతో వ్యవహరించారని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కీలక ప్రాజెక్టులన్నీ కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలని కొనియాడారు. సమావేశంలో తెలంగాణ నీటివనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ మాట్లాడుతూ బనకచర్ల నుంచి మూడు దశల్లో రాయలసీమ ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. ఏపీ నీటి దోపిడిపై అపెక్స్ కమిటీ సమావేశం పెట్టాల్సి ఉండగా, ఆ దిశగా రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవడం లేదని, చంద్రబాబు తన గురువు కాబట్టి ఏం చేసినా ఒప్పుకుందామనుకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డిని రాష్ట్రంలో తిరగనివ్వరని హెచ్చరించారు. తెలంగాణ బీసీ పొలికల్ జేఏసీ సమన్వయ కమిటీ చైర్మన్ హరిశంకర్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఏపీ జలదోపిడి యథేచ్ఛగా సాగుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.