ఖమ్మం, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /ఖమ్మం : తన సీఎం సీటుకు ఎసరు పెడతారన్న భయంతో డిప్యూటీ సీఎం భట్టి, మం త్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. వాళ్ల ఫోన్లను ట్యాప్ చేయడం లేదని రేవంత్‌రెడ్డి తన మనువడిపై ఒట్టేసి చెప్పగలడా? అని నిలదీశారు. ‘రాష్ట్రంలోని వేలాదిమంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది వాస్తవమో కాదో లైడిటెక్టర్ ముందు కూర్చొని చెప్పే దమ్ము రేవంత్‌కు ఉన్నదా?’ అని ప్రశ్నించారు. 50 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి రాష్ర్టానికి 50 పైసలు కూడా తేలేదని ఎద్దేవాచేశారు. హామీలు అమలు చేయడం రేవంత్ వల్ల కాదని, చర్చకు వచ్చే దమ్ము లేదని ధ్వజమెత్తారు. ఖమ్మంలోని తెలంగాణభవన్‌లో కేటీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపీ మంత్రి లోకేశ్‌ను తాను కలవలేదని స్పష్టంచేశారు. ఒకవేళ కలిస్తే తప్పేమున్నదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన మీటింగ్‌కు వెళ్లేది లేదని, చంద్రబాబు చెప్పినట్టు కేంద్రం వింటున్నదని మొన్నటి ఢిల్లీ మీటింగ్‌కు 48 గంటల ముందు డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత 24 గంటలు కూడా గడవకముందే ఢిల్లీ వెళ్లారని, సమావేశంలో పాల్గొన్నారని విమర్శించారు. మీటింగ్‌లో బనకచర్ల గురించి మాట్లాడలేదని రేవంత్‌రెడ్డి అంటే.. మొట్టమొదటి అంశం బనకచర్లేనని ఏపీ మంత్రి రామానాయుడు చెప్పారని గుర్తుచేశారు. 30 రోజుల్లో కమిటీ వేస్తామని, చంద్రబాబు డైరెక్షన్‌కు రేవంత్‌రెడ్డి ఓకే అన్నాడని కూడా ఆ మంత్రి చెప్పారని, తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తిగా చంద్రబాబుకు తాకట్టు పెట్టి రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని, అందుకే డైవర్షన్ కోసం చిట్‌చాట్‌లో అడ్డమైన చెత్తంతా వాగారని నిప్పులు చెరిగారు.
గురుదక్షిణను అడ్డుకుంటం
బనకచర్ల పేరుతో తన గురువు చంద్రబాబుకు సీఎం రేవంత్ ఇస్తున్న గురుదక్షిణను అడ్డుకుంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు. గోదావరి మిగులు జలాల్లో 1950 టీఎంసీలు, నికర జలాల్లో 968 టీఎంసీల వాటా తెలంగాణకు ఉన్నదని మోదీ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంతో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు వేయించిన కేసులను ఉపసంహరించుకుంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. రేవంత్ నోరు తెరిస్తే డ్రైనేజీ కంటే ఎకువ కంపు వస్తోందని, ఆయన ప్రెస్మీట్లు, చిట్‌చాట్‌లకు రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని, చిట్‌చాట్‌ల పేరుతో చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఒక తప్పు కూడా చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నానని, తనపై చేసిన ఆరోపణలను రేవంత్ నిరూపించాలని డిమాండ్ చేశారు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమన్న మొదటి నాయకుడిని దేశంలో తానేనని చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల పేరిట మోసం
బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాన్ని బీసీలు అర్థం చేసుకున్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ జపం చేయడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారని, ఆయన బతుకు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, హెడ్లైన్, డెడ్‌లైన్ మేనేజ్మెంట్లు అని తూర్పారబట్టారు. కేసీఆర్ స్థాయి గాని, ముఖ్యమంత్రి పదవికి ఉండే గౌరవం గాని రేవంత్‌కు ఈ జన్మలో రావని, కోట్ల విజయభాసర్‌రెడ్డి, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కేసీఆర్ లాంటి మహామహులు ముఖ్యమంత్రి పదవుల్లో ఎంతో హూందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి వల్ల కొన్ని థర్డ్ రేట్ యూట్యూబ్ చానళ్లకు, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరిగిందేమోగానీ రాష్ట్ర ప్రజలకు దమ్మిడి లాభం కలగలేదని నిప్పులు చెరిగారు. మీడియాను మేనేజ్ చేసి ఎకువ రోజులు బతకలేవని చురకలంటించారు. చిట్‌చాట్‌ల పేరుతో రేవంత్ చీటింగ్ చేస్తున్నాడని, అందుకే జనం ఛీ కొడుతున్నారని విమర్శించారు. 20 నెలలుగా తమపై టన్నులకొద్దీ అక్రమ కేసులు పెట్టినా గుండు పిన్నంత ఆధారం కూడా చూపించలేకపోయారని చెప్పారు.
లై డిటెక్టర్ టెస్టుకు వస్తవా?
‘లై డిటెక్టర్ చర్చ పెట్టుమనే దమ్ము నీకుందా? ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇవ్వజూపలేదని చెప్పే ధైర్యమున్నదా?, లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షకు వస్తావా?’ అని కేటీఆర్ సవాల్ చేశారు. ‘ఇద్దరి మీదా ఏసీబీ కేసు ఉన్నది. ముందుకు రావాలని సవాల్ చేస్తే ఎందుకు రాలేదు’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ వస్తడా? కేటీఆర్ వస్తడా? అని చాలెంజ్ చేసిన రేవంత్.. నేను వచ్చేసరికి పారిపోయిండు’ అని విమర్శించారు. ‘అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మమ్మల్ని మాట్లాడించే దమ్ముందా?’ అని ప్రశ్నించారు. ‘చర్చకు రమ్మంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కి వస్తా. లేదంటే ఆయన కొడంగల్ కోటకైనా వెళ్తా’ అని సవాల్ విసిరారు.
రేవంత్‌ను మానసిక వైద్యుడికి చూపించాలి
‘మానసిక రుగ్మతతో బాధపడుతున్న రేవంత్‌రెడ్డిని మానసిక వైద్యుడికి చూపించాలి. ఆయన సోదరులు ప్రభుత్వ కాన్వాయ్‌లలో తిరుగుతూ అడ్డగోలు సెటిల్మెంట్లు చేయడం, వాటాలు పంచుకోవడంలో బిజీగా ఉండకుండా అర్జెంటుగా రేవంత్‌రెడ్డిని మంచి డాక్టర్‌కు చూపించాలి’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అధికారికంగా చెప్పకపోయినా కాంగ్రెస్ చెప్తున్న అడ్డమైన అబద్ధాలను మీడియా ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దండుపాళ్యం బ్యాచ్ లాగా ఎనుముల బ్రదర్స్ తెలంగాణను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దా?
‘హామీల అమలుపై ప్రశ్నించడాన్ని వదిలేద్దామా? రైతులకు ఇస్తానన్న బోనస్‌ను, ఆడబిడ్డలకు ఇస్తానన్న తులం బంగారాన్ని అడగడం మానేద్దామా?’ అని ప్రజలను కేటీఆర్ అడిగారు. ‘రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో, మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడిస్తాడో, వడ్ల బోనస్ ఎంత ఇచ్చాడో? రైతుభరోసా రూ.15 వేలు అని చెప్పి రూ.12 వేలే ఎందుకిస్తున్నాడో? ఆడ పిల్లలకు సూటీలు ఎప్పుడిస్తాడో? వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఎప్పుడిస్తాడో? చెప్పే దమ్ము రేవంత్‌కు ఉన్నదా?’ అని నిలదీశారు.
రేవంత్ సీఎం కావడం.. తెలంగాణకు అవమానం..
నమ్మి ఓటేసిన పాపానికి రేవంత్‌రెడ్డి దేశ రాజధానిలో తెలంగాణ ప్రజల గొంతు కోశాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు. త్యాగాలు, బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణకు రేవంత్ సీఎం కావడం మనందరికీ అవమానమని వాపోయారు. పొలంలో నీళ్లు పారాలి గాని రైతు కళ్లలో కన్నీళ్లు పారకూడదన్న లక్ష్యంతో సీతారామ, భక్తరామదాసు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ వంటి పథకాలను కేసీఆర్ చేపట్టారని గుర్తుచేశారు. వీటిద్వారా రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని జ్ఞప్తికి తెచ్చారు.
పొంగులేటికి సగం.. ఈస్ట్ ఇండియా కంపెనీకి సగం
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి పొంగులేటికి రూ.4 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి ఏడాది దాటినా ఇప్పటివరకు అటు ఈడీ గాని, ఇటు పొంగులేటి గాని మాట్లాడకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్‌గాంధీకి పంపుతున్న రేవంత్.. తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద మిగిల్చాడని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో సగం పనులు, మంత్రి పొంగులేటి కంపెనీకి సగం పనులు అప్పగించారని ధ్వజమెత్తారు. ‘మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎత్తు గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి ఏమైనా అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నడా?’ అని దెప్పిపొడిచారు. మిస్ వరల్డ్ పోటీల్లో కాంగ్రెస్ నాయకులు తనను వేధించారని, వేశ్య లాగా చూశారని మిస్ ఇంగ్లండ్ ఆరోపించినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కొన్ని మీడియా సంస్థల చేతుల్లో రేవంత్ జుట్టు
కొన్ని మీడియా సంస్థలు సీఎం రేవంత్‌రెడ్డికి బాకా ఊదుతున్నాయని, ఆ సంస్థలు చెప్పినట్టు రేవంత్ ఆడుతున్నాడని, ఆయన జుట్టు ఆ మీడియా సంస్థల చేతుల్లో ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. 20 నెలల్లో రాష్ర్టానికి, ఖమ్మం జిల్లాకు ఏం చేశాడో రేవంత్‌రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ఓపెనింగ్‌కి వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకొని పోవడం తప్ప రేవంత్, ఆయన మంత్రులు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 420 హామీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ పాలకులను ఫుట్బాల్లా ఆడుకుంటామని తేల్చిచెప్పారు. ఇదే ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండమైన మెజారిటీతో రానున్న రోజుల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని స్పష్టంచేశారు.
కేసీఆర్‌తోనే ఖమ్మం అభివృద్ధి
‘పదేండ్లలో ఖమ్మానికి కేసీఆర్ ఏం చేశారని ఒకరు అడుగుతున్నరు.. 2014లో ఖమ్మం ఎలా ఉండేది? 2023 నాటికి ఎలా అయింది? ఖమ్మంలో గతంలో ఎన్ని మెడికల్ కాలేజీలుండేవి? రోడ్లు, చెరువులు ఎట్లుండేవి?’ అని ప్రశ్నించారు. ఖమ్మాన్ని కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో ఇక్కడి ప్రజలకు తెలుసునని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫోన్లను రేవంత్‌రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో వేలాదిమంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది వాస్తవమో కాదో లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్పే దమ్ము రేవంత్‌కు ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
రేవంత్ బతుకు రైతులకు తెలుసు
రాష్ట్రంలో ఏ రైతు ఇంటికెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డి బతుకేందో చెప్తారని కేటీఆర్ విమర్శించారు. తాను ఏ చాలెంజ్కైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. ‘42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తానన్నాడు. కనీసం కొడంగల్‌లో అయినా ఇచ్చిండా? మంత్రివర్గంలో 42 శాతం బీసీలున్నరా? తన చేతుల్లో ఉన్న ఏ పనీ చేయకుండా కేంద్రం చేతిలో ఉన్న రిజర్వేషన్లను మాత్రం అమలుచేస్తానని అబద్ధమాడుతున్నడు’ అని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఈశ్వరయ్యగౌడ్ చెప్పారని గుర్తుచేశారు.
బనకచర్లకు అనుమతి లేదు..
బనకచర్లకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతి లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కూడా లేవని చెప్పారు. రేవంత్, మోదీల జుట్టు తన చేతిలో ఉన్నదని ఏపీ సీఎం చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రజలకు, ఆంధ్రా రైతులకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. ముందుగా తెలంగాణ హకులు తేల్చాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. కాళేశ్వరంతోపాటు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన చంద్రబాబు ఇవాళ సానుభూతి మాటలు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ ఎన్నటికీ రాజీపడబోదని స్పష్టం చేశారు.
ఎన్నికలొస్తే వంద సీట్లు బీఆర్ఎస్వే
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం మమత హాస్పిటల్ ప్రాంగణంలోని పువ్వాడ అజయ్ ఇంటి వద్ద పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తమపై, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకూ రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని, ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు. 2014లో కేవలం 63 సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ.. 2018 నాటికి 88 సీట్లు గెలుచుకున్నదని, 2023లో ఆశించిన ఫలితాలు రాలేదని, అయినా ఇది కూడా మంచిదేనని చెప్పారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి 2023లో ప్రజలు వారికి అధికారాన్ని కట్టబెట్టినా ప్రజలకు వారు చేసింది శూన్యమని మండిపడ్డారు.
రాహుల్, ప్రియాంక గాంధీలను పిలిపించి యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులను బురిడీ కొట్టించారని ఫైర్ అయ్యారు. ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ కాటేసి కాటికి పంపుతుందన్న నిజం ప్రజలకు అర్థమైందని తెలిపారు. ఇంత నీచ రాజకీయాలు ఉంటాయని డాక్టర్ బీఆర్ అంబేదర్ కూడా ఊహించలేదని, అందుకే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రీకాల్ వ్యవస్థను రాజ్యాంగంలో పొందు పరచలేదని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని, పార్టీ వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ టీడర్ షేక్ మక్బుల్, బచ్చు విజయ్‌కుమార్, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరునాయక్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రాంమ్మూర్తి, కొత్తా వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఏపీ మంత్రి లోకేశ్‌ను నేను కలవలే. ఒకవేళ కలిస్తే తప్పేమున్నది? రేవంత్ లెక్క లోకేశ్ అంతర్రాష్ట్ర దొంగ కాదు కదా? లోకేశ్ ఏమైనా దావూద్ ఇబ్రహీమా? లేక గూండానా? నీ పెద్ద బాస్ కొడుకే కదా?
– కేటీఆర్
ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటడు. ఇంకోరోజు ఫార్ములా-ఈ అంటడు. మరోరోజు డ్రగ్స్ అంటడు. కాదంటే కాళేశ్వరం అంటడు.. లేదంటే కేసీఆర్ అంటడు. ఇవి తప్ప ప్రజలకేంచేద్దాం? హామీలు ఎట్ల నెరువేరుద్దాం? అని ఆలోచించడు. ఆయన బతుకు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, హెడ్లైన్, డెడ్‌లైన్ మేనేజ్మెంట్లు.
– కేటీఆర్
ఎవరైనా.. పాలన గురించి తెలుసుకోవాలంటే బీఆర్ఎస్ నాయకులను వచ్చి కలుస్తరు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తరు.
–కేటీఆర్
దుబాయ్‌లో ఎవరో చనిపోతే రేవంత్‌రెడ్డి నామీద నిందలు వేసి శవాల మీద పేలాలు ఏరుకు తింటున్నడు. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలి. సీఎం రేవంత్‌రెడ్డిలా నేను చీకట్లో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోలేదు.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డి తన వారి కోసమే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నడు. ఎనుముల సోదరుల కోసం ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, ట్రిపుల్ ఆర్ పేరిట భూదందాలు చేసుకునే మొదటి గ్యారెంటీ, బాబు కోసం బనకచర్ల రెండో గ్యారెంటీ, రాహుల్‌గాంధీకి నెలనెలా డబ్బుల మూటలు పంపడం మూడో గ్యారెంటీ, బామ్మర్ది కోసం అమృత్ కాంట్రాక్ట్ నాలుగో గ్యారెంటీ, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతు నొకడం ఐదో గ్యారెంటీ, నెలకు నాలుగుసార్లు ఢిల్లీ వెళ్లి చీకట్లో మోదీ కాళ్లు పట్టుకోవడం ఆరో గ్యారెంటీ..
– కేటీఆర్
నక పీనుగునే పీకు తింటది. పంది బురదలోనే పొర్లుతది. పెండ పురుగు గొడ్ల సావిడిలోనే తిరుగుతది. అట్లనే గుంపు మేస్త్రీ నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు. నికృష్టపు మాటలు తప్ప మంచి మాటలు అస్సలు రావు.
-కేటీఆర్