హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే గోదావరి-కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకొంటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ అనాలోచిత చర్యల కారణంగా తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాలపై శాశ్వతంగా హక్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమై తెలంగాణ రైతుల గొంతు కోసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైందని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. వరద జలాల పేరిట ఏపీ సర్కార్ బురద రాజకీయం చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ గుడ్డిగా తలూపుతున్నదని మండిపడ్డారు.
కావేరి లింక్ పేరిట గోదావరి నీళ్లను తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను కృష్ణా జలాల్లో వాటా వదులు కోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాలని, ఇందుకు సంబంధించి రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించడం వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇచ్చంపల్లి, సమ్మక్క-సారక్క, ఇంద్రావతి లింక్ చేస్తే తెలంగాణలో వరద నియంత్రణ ఇబ్బందికరంగా మారుతుందని వాపోయారు.
గోదావరి-కావేరి అనుసంధానం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను ఉల్లంఘించడమేనని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ.. కృష్ణా ట్రిబ్యునల్-2లో మొదట డిమాండ్ చేసినట్టు కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్-1980 ప్రకారం గోదావరిలో 968 టీఎంసీల వాటా ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పూర్తిగా తన నీటి వాటాను వినియోగించుకోవాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి వినియోగం కోసం తెలంగాణ ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం శ్రీశైలంను హెడ్రో ఎలక్ట్రిసిటీకి మాత్రమే వినియోగించుకోవాలని అభ్యంతరాలు తెలిపి రిజర్వాయర్‌ను తెలంగాణకు దూరం చేసిందని విమర్శించారు.
తర్వాత కాలంలో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చన్నైకి తాగునీటి సరఫరా పేరిట పోతిరెడ్డిపాడును నిర్మించి 1,500 క్యూసెక్కులకు బదులు లక్ష క్యూసెక్కులను తరలించారని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నాగర్జునసాగర్ నుంచి నీటిని ఏపీకి తరలించే కుట్రలో భాగంగా గోదావరి-కావేరి లింక్‌ను తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ సర్కార్ అప్రమత్తమై అడ్డుకోవాలని, లేదంటే తెలంగాణ శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ నీటి హక్కులు, వాటాల కోసం డిమాండ్ చేయకుండా ఏపీ ప్రతిపాదనలకు తెలంగాణ కాంగ్రెస్ గొర్రెలా ఎందుకు తలూపుతున్నదని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల ప్రతిపాదికన అని గుర్తుచేశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం జరిగితే బీఆర్ఎస్ ఊరుకోబోదని, ప్రజాఉద్యమానికి శ్రీకారం చుడుతామని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ, కాంగ్రెస్ ఆంధ్రాకు తాకట్టుపెడుతున్నాయని ఆరోపించారు. 2 జాతీయ పార్టీల ఎంపీలు రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాడకుండా పార్టీ అధిష్ఠానాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి రాష్ట్రానికి నష్టంకలిగించే చర్యలను తిప్పి కొట్టాలని డిమాండ్ చేశారు.