హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ప్రవేశపెట్టిన కులగణన సర్వే నివేదికపై ప్రకటనలు, ప్రగల్భాలకే సర్కారు పరిమితమైంది. నివేదికలోని అంశాలను రెండురోజుల క్రితమే మంత్రుల సబ్‌కమిటీ వెల్లడించింది. ఇదే నివేదికను మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టారు. సర్వే నివేదికను ప్లానింగ్‌శాఖ ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను మంత్రి ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో మొత్తం జనాభా 3.7 కోట్లు కాగా, వారిలో 16 లక్షల మంది (3.1%) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు నివేదించారు. అందులో బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఓసీలు 15.79%, ఎస్టీలు 10.45% ఉన్నట్టు తెలిపారు. తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం కూడా ఇవే అంశాలను చెప్పింది తప్ప కొత్తగా ఒక్క అంశాన్నీ చేర్చలేదు. తొలగించలేదు. అదనపు గణాంకాలను నివేదించలేదు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ సర్వే చేపట్టామని గొప్పగా చెప్పుకున్నారు.
అయితే బీఆర్ఎస్తోపాటు ఇతర విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నివేదికను తప్పుల తడకగా రూపొందించారని, ఉద్దేశపూర్వకంగానే బీసీ వర్గాల జనాభాను తగ్గించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి స్పందన కరువైంది. ఒకానొక దశలో మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థంకాలేదు. నివేదికను హడావుడిగా సభలో పెట్టడంపై పలువురు మంత్రులు, అధికార పార్టీ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండా సభ ముందుకు తేవడంతో అభాసుపాలయ్యామని ఒకింత అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ సర్వేలోని అనేక లోపాలను సవరించకుండానే అసెంబ్లీలో పెట్టడంతో బీసీ సంఘాలతోపాటు ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇచ్చినట్టయిందని లోలోన రగిలిపోయినట్టు వినికిడి.
హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు కోటాను ఎగ్గొట్టి బీసీలకు తీరని ద్రోహం చేశారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేందర్ ధ్వజమెత్తారు. తప్పుల తడకగా కులగణన నివేదిక రూపొందించారని ఆరోపించారు. 42% కోటా కోసం చట్టం చేస్తామని చెప్పి తీరా పంచాయతీ ఎన్నికల ముందర ఉసూరుమనిపించారని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం బీసీల జనాభాను తగ్గించి చూపడం దుర్మార్గామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లపై సర్కారు దమనకాండకు దిగుతున్నది. హైదరాబాద్‌కు వెళ్తున్నారనే సమాచారంతో రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మంగళవారం రాత్రే మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ల జేఏసీ ముఖ్య నాయకులను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. ప్రభుత్వ వైఖరిపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు ఇవ్వకుండా గోసపెడుతున్న సర్కారు నిరసనకు కూడా అవకాశం ఇవ్వకపోడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.