వికారాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది. ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ రైతు బీమా అందించింది. వారంలోనే బాధిత కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల బీమా సాయం జమచేసి అండగా నిలిచింది. కానీ రేవంత్ సర్కార్లో రైతుబీమా కోసం బాధిత కుటుంబం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సాయం అందక ఆవేదనతో పలుచోట్ల బాధిత కుటుంబాలు అధికారులను నిలదీస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతు బీమా సాయం అందడంలో చాలా ఆలస్యమవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో ఎవరైనా రైతు ఏదేని కారణంతో చనిపోతే మరుసటి రోజే ఏఈవోలు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ వివరాలను సేకరించి రెండు, మూడు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి జారీచేసేలా చర్యలు చేపట్టేవారు.
నామినీ వివరాలను కూడా వెంటనే ఆన్లైన్ చేసి త్వరగా ప్రక్రియ పూర్తి చేసే పరిస్థితులు ఉండేవి. ఎల్ఐసీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారం, పది రోజుల్లో రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో బీమా డబ్బులు జమయ్యేలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు ఆ పథకంపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పోయింది. రైతు మరణిస్తే మూడు, నాలుగు నెలలకు కూడా బీమా సాయం అందకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్ వచ్చాక వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1,895 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయగా, వీరిలో 1,692 మంది కుటుంబాలకు బీమా సాయం అందడంలో జాప్యం జరిగింది. మరో 203 మంది రైతు కుటుంబాలు నాలుగైదు నెలలుగా బీమా సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. రైతు డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలన్నింటితో ఆన్లైన్లో దరఖాస్తు చేసినా బీమా సాయం జమయ్యేందుకు మూడు, నాలుగు నెలలు పడుతున్నట్టు స్వయంగా అధికారులే చెప్తున్నారు. రైతు బీమా పథకంపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే బీమా సాయం అందడంలో ఆలస్యమవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో రూ.213 కోట్ల సాయం
బీఆర్ఎస్ హయాంలో వికారాబాద్ జిల్లాలో 4,262 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.213.10 కోట్ల బీమా సాయం అందింది. 2018-19లో 786 మంది రైతు కుటుంబాలకు రూ.39.30 కోట్లు, 2019-20లో 812 మంది కుటుంబాలకు రూ.40.60 కోట్లు, 2020-21లో 1,201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 2021-22లో 1,047 కుటుంబాలకు రూ.52.35 కోట్లు, 2022-23లో 416 మంది రైతు కుటుంబాలకు రూ.20.80 కోట్ల బీమా సాయం అందింది.