హైదరాబాద్, నవంబర్13 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)అపాయింట్మెంట్ దొరకలేదా? తనకు ఎలాగైనా సోనియాను కలిసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను అభ్యర్థించినా ఆయన ససేమిరా అన్నారా? అంటే ‘అవును’ అనే తెలుస్తున్నది. బుధవారం సాయం త్రం ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి గురువారం జరిగిన అమెరికా- భారత్ వ్యూ హాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. పనిలో పనిగా ఏఐసీసీ ముఖ్యనేతలను కలిసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్లో నిర్వహించే విజయోత్సవ కార్యక్రమానికి సోనియాగాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని రేవంత్‌రెడ్డి భావించినట్టు తెలిసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆరు గ్యారెంటీలను ప్రకటించిన తుకుగూడ ప్రాంతంలోనే రెండేండ్ల విజయోత్సవ సభ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను రేవంత్ అభ్యర్థించగా ‘ఏఐసీసీ అంతా బీహార్ ఓట్ల లెక్కింపు మీదనే దృష్టిపెట్టి ఉన్నది. ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకడం సాధ్యం కాదు’ అని కేసీ తెగేసి చెప్పినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రావాలని సూచించినట్టు సమాచారం. దీం తో మరో వారంలో మళ్లీ ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ నేతలను కలవాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.