Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో కులాల చిచ్చు రగులుకుంటున్నది. కాంగ్రెస్ సం‘కుల’ సమస్యలో చిక్కుకున్నది. కులగణన పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట వంచించారని దళిత బహుజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండటంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎవరికీ జవాబు చెప్పుకోలేని, ఎవరినీ సంతృప్తి పరచలేని అయోమస్థితిలో కూరుకుపోయింది. వెరసి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిర్వాకం హైకమాండ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించింది. దీంతో నలుగురు ముఖ్యులు గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. వీరే కాకుండా మరికొందరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు ముఠా కట్టి సమావేశాలు నిర్వహిస్తున్న తీరుపై అధిష్ఠానం ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుతో ఏమాత్రం ముందస్తు వ్యూహరచన లేకుండా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను తెరమీదకు తేవడం పట్ల ఢిల్లీ పెద్దల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి.
ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బాహాటంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కొందరు మంత్రులు, మరీ ముఖ్యంగా వలస వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న నేతలపై పార్టీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్రంగా కలతచెందారు. ఆ కొద్దిమంది నేతల వ్యవహారశైలితో ఇప్పటికే పార్టీలోని నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారనే టాక్ వినిపిస్తున్నది. పాత, కొత్త నాయకుల మధ్య ఎక్కడా పొసగడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఇటీవల పలుచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకోవడం ఆ వాదనలకు బలాన్ని చేకూర్చుతున్నది. దీనికితోడు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి 10మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం మరింత వేడెక్కించింది. ఈ భేటీలో కొంతమంది మంత్రుల వ్యవహారశైలిపై అంతర్గతంగా చర్చించుకోవడం, తమ పనులే కావడం లేదని, కొద్దిమంది నేతలకు సంబంధించిన పనులనే చేస్తున్నారని ఒకరితో ఒకరు అసంతృప్తి వ్యక్తంచేసుకున్నట్టు సమాచారం. రహస్య భేటీ వ్యవహారం బయటకు పొక్కడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసి కాంగ్రెస్ అధిష్ఠానం కలవరానికి గురైంది. ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేయడమే కాకుండా, వెంటనే ఎమ్మెల్యేలతో భేటీ కావాలని, వారితో చర్చించాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవలనే జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్టు ప్రకటించారు. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతున్నది.
28
తాజాగా కులచిచ్చు
ఒకవైపు ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు మంత్రుల తీరుపై అసంతృప్తితో రెండువర్గాలు చీలిపోగా, తాజాగా కులచిచ్చు కూడా రగులుకున్నదని తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ సిఫారసులను ఆమోదించింది. ఆ రెండు అంశాలు ఇప్పుడు కాంగ్రెస్‌నే హడలెత్తిస్తున్నాయి. తమ జనాభా శాతాన్ని తగ్గించి చూపారని, ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని పార్టీలోని బీసీ నేతలు, ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. దీనిని అగ్రకుల సర్వేగా అభివర్ణిస్తూ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ సర్వే నివేదికను కాల్చడం, తాజాగా సదరు నేతకు నోటీసులు ఇవ్వడం పార్టీలో విభేదాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విషయంపై అధిష్ఠానానికి కొందరు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. మరోవైపు, మరికొందరు బీసీ నేతలు తమ జనాభా శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవితోపాటు మరో మూడు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు, వర్గీకరణకు సంబంధించి తీవ్ర అన్యాయం చేశారంటూ దళితనేతలు సైతం తిరుగుబాటు బావుటాను ఎగరేసినట్టు తెలుస్తున్నది. మొత్తంగా బీసీ ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేల్లో అనుకూల, అననుకూల వర్గాలుగా చీలిపోయి పార్టీ హైకమాండ్‌కు మొరపెట్టుకుంటున్నట్టు సమాచారం. దీంతో పార్టీ అధిష్ఠానం ఎవరికి ఏ సమాధానం చెప్పాలో, ఏవిధంగా నచ్చచెప్పాలో తెలియక గందరగోళంలో పడినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల తీరు, మంత్రుల వ్యవహార శైలి, ప్రభుత్వ నడవడిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
ఖర్గేతో మాల నేతల భేటీ!
ఎస్సీ వర్గీకరణ అమలు అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ మాల సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో పలువురు నేతలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. వర్గీకరణ వల్ల మాల సామాజికవర్గం యావత్ కాంగ్రెస్‌కు దూరమవుతుందని, పార్టీకి ఇది తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పినట్టు తెలుస్తున్నది. ఒకవర్గం లాబీతో, మెప్పు పొందేందుకు ప్రభుత్వ పెద్దలు ఏకపక్షంగా వర్గీకరణ అమలు నిర్ణయం తీసుకున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, వర్గీకరణ అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఒక కమిటీని వేయాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. కమిటీ సిఫారసుల ప్రకారం వర్గీకరణ అమలుపై ముందుకుపోవాలని పట్టుబట్టినట్టు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.
ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదులు
పార్టీ, ప్రభుత్వం తీరుపై సుమారు 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి వివిధ రూపాల్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వీరంతా ఎవరికి తోచినట్టు వారు ఫిర్యాదులు చేశారు. వీరితోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్తుపై పార్టీ అధిష్ఠానానికి మొరపెట్టుకున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టులో అనర్హత వేటు పిటిషన్‌పై వాదనలు జరుగుతుండటం, సుప్రీంకోర్టు ఆగ్రహంగా ఉండటం, అనర్హత వేటు పడితే ప్రత్యామ్నాయం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దడ మొదలైంది. ఇదే విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.
మంత్రి జూపల్లి కృష్టారావుతో కలిసి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తనకు కూడా పార్టీ అధిష్ఠానం సమయం ఇవ్వాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖర్గేను కోరినట్టు తెలిసింది. వీరి బాటలోనే మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధిష్ఠానంతోనే తేల్చుకుందామన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇక వీరితోపాటు కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో రాష్ట్రంలోని పార్టీ, ప్రభుత్వం తీరుపై ఆరోపణలు చేస్తూ అధిష్ఠానాన్ని ఆశ్రయించారు. తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధిష్ఠానాన్ని కలిసి తీవ్ర నిరసన వ్యక్తంచేసినట్టు సమాచారం. వీటన్నింటిపై పార్టీ అధిష్ఠానం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీతో చర్చించే అవకాశం ఉన్నది.
పీసీసీ కూర్పు, క్యాబినెట్ విస్తరణ ఉంటుందా?
పీసీసీ కూర్పు, మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ అధిష్ఠానం గురు, శుక్రవారాల్లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 14 నెలలుగా రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలంటూ పార్టీ ఎమ్మెల్యేల నుంచి అధిష్ఠానం తీవ్ర ఒత్తిడి ఉన్నది. మంత్రివర్గంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై కూడా పార్టీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
31వ సారి ఢిల్లీకి రేవంత్
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గడిచిన 14 నెలల్లో రేవంత్‌రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లగా.. గురువారం పర్యటన 31వది కానున్నది.
నేడు సీఎల్పీ భేటీ.. ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్
రేవంత్‌రెడ్డి సర్కార్ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఢిల్లీ పిలిచినట్టు సమాచారం. వాస్తవంగా అసంతృప్త ఎమ్మెల్యేతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తొలుత నిర్ణయించారు. అదేవిధంగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ ఉంటుందని ప్రకటించారు. అధిష్ఠానం ఆగ్రహం నేపథ్యంలో ముందస్తుగా నిర్ణయించిన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని సీఎల్సీ సమావేశంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు జరగనున్న సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను కూడా ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా అంతకంటే ముందే ఉదయం 11 గంటలకే సీఎల్పీ నిర్వహించాలని నిర్ణయించడం హాట్‌టాపిక్‌గా మారింది. మధ్యాహ్నంలోపు సీఎల్పీ భేటీని పూర్తిచేసుకొని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనమవుతారు. ఢిల్లీ పర్యటనపై అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించకపోయినప్పటికీ, పలువురు కాంగ్రెస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సహా ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్తున్నట్టు ధ్రువీకరించారు. కీలక నేతలను తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించిన నేపథ్యంలో రాజకీయవర్గాల్లో, కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్‌లో ఏదో జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.