కేసీఆర్ సర్కార్‌పై బట్టకాల్చి మీదవేసేందుకు సొంతగడ్డకే ద్రోహం తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ‘పాలమూరు-రంగారెడ్డి’పై చెప్పింది పచ్చి అబద్ధమని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఎత్తిపోతల పథకంలో మొత్తం ఐదు స్టేజ్‌ల ద్వారా 90 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకొని, 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు నిర్మించి 90 శాతం పనులు పూర్తి చేసింది. మొత్తం 27,081.95 ఎకరాలు అవసరమైతే,అక్షరాలా 26,950.97 ఎకరాలు సేకరించింది. చాలాచోట్ల భూసేకరణ చట్టం-2013 ప్రకారం మెరుగైన పరిహారం అందించి నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆర్అండ్ఆర్ కాలనీలు మినీ పట్టణాల్లా కళకళలాడుతున్నాయి. పాలమూరు పథకంలో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి బృందం సందర్శించగా కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున భూసేకరణ చేసి రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టినట్టు తేటతెల్లమైంది. కేవలం మిగిలిన కాలువ పనులు పూర్తిచేస్తే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఈ పని చేయలేకనే ఏదో విధంగాకేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో ‘భూసేకరణ చేయలేదు’ అని రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారం చేశారని రూఢీ అయింది.
(నీంకర్ వెంకటేశ్వర్రావు బృందం)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. అసలు భూసేకరణ జరుగకుండానే పనులు చేపట్టారని చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టమైంది. ఈ ఎత్తిపోతల పథకం కోసం ఉమ్మడి పాలమూరు రైతులు ఏకంగా 26,950.97 ఎకరాల పంట భూములను త్యాగం చేశారు. పాలమూరు కరువును శాశ్వతంగా పారదోలే ఈ ఎత్తిపోతల పథకంలో వేలాది మంది రైతులు, రైతు కూలీలు, బంగారు పంటలు పండే తమ భూములను లక్షలాది మంది ప్రయోజనాల కోసం వదులుకున్నారు.
ఈ ఎత్తిపోతల పథకాన్ని మహాయజ్ఞంగా భావించిన కేసీఆర్ 2016 జూన్ 11న ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కరోనా కష్టకాలాన్ని కూడా జయించి 2023న సెప్టెంబర్ 16న కృష్ణానది జలాలను ఉప్పొంగించి రైతుల కండ్లల్లో సంతోషాన్ని చూశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సింది పోయి నిరాశే మిగిల్చారు.
ఈ పథకం పూర్తిచేస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోనని 30 నెలలుగా పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కార్యాచరణకు దిగడంతో హడావుడిగా ప్రాజెక్టుల బాట పట్టింది.
మహబూబ్‌నగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండ్రోజులపాటు హెలికాప్టర్లో మంత్రులను వెంటబెట్టుకొని వచ్చి కనీసం ఒక్క రైతును కూడా కలువకుండా.. ప్రజలతో మాట్లాడకుండా గాల్లో చక్కర్లు కొట్టి మమ అనిపించారు. ఎప్పటిలాగానే అబద్ధాలను పదేపదే వల్లిస్తే నిజాలు అవుతాయని నమ్మిన రేవంత్‌రెడ్డి మరోసారి సొంత జిల్లా ప్రజలకు శఠగోపం పెట్టే ప్రయత్నం చేశారు. 12,30,000 ఎకరాలకు నీళ్లు అందించే ఈ పథకాన్ని 30 నెలలుగా పడావు పెట్టారు. మరోవైపు, ఈ జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇదే ఎత్తిపోతల పథకంపై నేరుగా నల్లగొండ జిల్లాకు నీళ్లు అందించేందుకు రూ.1,800 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై కక్కిన అక్కసు అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కరివెన రిజర్వాయర్ గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘భూ సేకరణ కూడా చేయలేదు.. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా.. పూర్తి చేయాలన్నా.. మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం.
ఈనాటికీ అధికారులు అందించిన సమాచారం మేరకు పనులు పూర్తి చేయడం దేవుడెరుగు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ జరుగలేదు.. భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు పూర్తయితాయని చంద్రశేఖర్‌రావు ఎట్లా భావించారని నేను అడుగుతున్నా.. ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వకుండా వదిలేసి పోయిండు’ అని ఆరోపించారు. కానీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ చేపట్టి రైతులకు పరిహారం అందించిన తర్వాతనే పనులు మొదలు పెట్టిందని తేటతెల్లమైంది. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి బృందం పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లతోపాటు కరివెన రిజర్వాయర్‌ను కూడా సందర్శించింది. ఈ ఎత్తిపోతల పథకం కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు తమ భూములను ఈ పథకం కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. దీనికి నిదర్శనంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద అంజనగిరి, ఏదుల రిజర్వాయర్ సమీపంలో తీగలపల్లి వద్ద నిర్మించిన పునరావాస కేంద్రాలే నిదర్శనం. మరోవైపు, కరివెన రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తండా ప్రజలు వచ్చిన నష్టపరిహారంతో ఏకంగా అక్కడి మాజీ ఎమ్మెల్యే పేరు మీద కాలనీలు ఏర్పాటు చేసుకొని భూములను కొనుగోలు చేసి ఇవాళ కోటీశ్వరులు అయ్యారు.
27 వేల ఎకరాల భూసేకరణ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొత్తం ఐదు స్టేజీల ద్వారా 90 టీఎంసీలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో 12.3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే భారీ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 27,081.95 ఎకరాలు అవసరం కాగా, 26,950.97 ఎకరాలు సేకరించింది. చాలాచోట్ల భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం అందించింది. ఇంత భారీ ఎత్తున భూసేకరణ చేసిన ఎత్తిపోతల పథకం ఇదే. గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నిటికీ కలిపి సేకరించిన భూమిని అంతా కలిపినా ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో మూడోవంతు కూడా లేదు. ఇంత పెద్దఎత్తున భూసేకరణ చేసి ఎక్కడా ఎలాంటి ఘటనలు లేకుండా రైతులతో మాట్లాడి ఒప్పించి పరిహారం అందజేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎత్తిపోతల పథకం కోసం ఇంకా 4,000 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉన్నదని మరో అబద్ధాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఈ ఎత్తిపోతల పథకానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇంకా 128.75 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి భూసేకరణపై చేసిన ఆరోపణలాన్నీ పూర్తిగా అబద్ధమని తేలాయి.

పెండింగ్‌లో నార్లాపూర్-ఏదుల ఓపెన్ కెనాల్
పాలమూరు ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు లింక్‌గా మారిన ఓపెన్ కెనాల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పూర్తి చేయలేదు. ఈ ప్రధాన కాలువ మొత్తం బండరాళ్లతో కూడుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1.3 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తొలగించారు. ఇంకా 30 వేల క్యూబిక్ మీటర్ల రాయిని తొలగించి ఈ కాలువను పూర్తి చేస్తే నేరుగా నీళ్లు కరివెన రిజర్వాయర్ వరకు పంపింగ్ చేసుకొనే అవకాశం ఉన్నది. ప్యాకేజీ నంబర్-3లో ఎనిమిదిన్నర కిలోమీటర్ల పొడవున్న ఈ కెనాల్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పథకంపై పాదయాత్ర చేసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో హడావుడిగా రెండు, మూడ్రోజుల నుంచి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు పదివేల క్యూబిక్ మీటర్ల రాళ్లను తొలగించి కాలువను సిద్ధం చేయాల్సి ఉన్నది.
పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు చూసి అవాక్కైన సీఎం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్ని పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, మెయిన్ కెనాల్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇటీవల పరిశీలించిన విషయం తెలిసిందే. ప్రతిచోటా టన్నెల్లోకి వెళ్లి ఇంజినీరింగ్ అద్భుతాన్ని చూశారు. సర్జ్‌పూల్, బాహుబలి పంపులను చూసి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇన్ని టన్నులున్న భారీ పంపులను లోపలికి ఎలా తీసుకొచ్చారో? ఎలా బిగించారో? అధికారులు సీఎంకు వివరించారు. ఇదంతా చూసిన తరువాత కూడా ఏదోరకంగా కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో భూసేకరణ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మీడియా ముందు అక్కసు వెళ్లగక్కారు. అయితే ఇది పూర్తిగా అబద్ధమని తేలడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకపోతే జిల్లా రైతాంగం క్షమించదనే ఉద్దేశంతో డిఫెన్స్‌లో పడ్డారు. ప్రస్తుతం అంచనాలు పెరిగాయని.. భూసేకరణ చేయాల్సి వస్తుందని.. ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నాయని మభ్యపెడుతూ భారీ కుట్రలకు తెరలేపుతున్నారు. పనులు చేపడుతున్నట్టు నమ్మించి పెద్దఎత్తున కమీషన్లు దండుకోవడానికి ప్లాన్లు చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యక్తంచేస్తున్నారు.
ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కాలనీ
ఇది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో వెలసిన నిర్వాసిత కాలనీ. ఇదే మండలంలోని కరివెన రిజర్వాయర్ కింద ముంపునకు గురైన నాలుగు తండాల ప్రజలు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అండదండలతో నాటి ప్రభుత్వంతో నిర్వాసితులకు కావాల్సిన వసతులు, పరిహారం ఇప్పించడంతో వారంతా ఆనందంతో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములను కొనుగోలు చేసి సొంతంగా ఇండ్లు నిర్మించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నిర్వాసితులకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని జీవితకాలం గుర్తుంచుకొనేందుకు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కాలనీ అని పేరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో భూమికి భూమి కొనుగోలు చేయడం.. కరివెన ప్రాజెక్టు రావడంతో భూముల విలువ ఒక్కసారిగా వెయ్యి రేట్లు పెరిగింది. రూ.మూడు లక్షలకు ఎకరం కొన్న రైతులు ఇవ్వాళ్ల ఎకరా రూ.40 లక్షలకు ధర పలుకుతుండటంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు.

భూగర్భంలో ఇంజినీరింగ్ అద్భుతం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్రంలోని భారీ ఎత్తిపోతల పథకాల్లో ఒకటి. కృష్ణానదీ జలాలపై శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ సోర్స్‌గా నిర్మించిన ఈ పథకం ద్వారా మొత్తం 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చు. పాలమూరు జిల్లా కృష్ణా నది పరీవాహక ప్రాంతం మొత్తం ఎగువన ఉండటంతో నాలుగు స్టేజీల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఐదు చోట్ల భారీ రిజర్వాయర్లు నిర్మించి ఈ నీటిని నింపుతారు. అక్కడినుంచి 12.3 లక్షల ఎకరాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు అందిస్తారు. ఈ పథకం పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పైకి కనబడకుండా భూ గృహంలోనే సర్జ్‌పూల్స్, పంప్‌హౌస్‌లు నిర్మించారు. ఒక్కోచోట దాదాపు 5 నుంచి 8 అంతస్తుల లోతు టన్నెల్ తవ్వి.. ఒక్కో పంప్‌హౌస్‌లో బాహుబలికి మించిన పంపులను బిగించారు. రోజుకు రెండు టీఎంసీలను తరలించే విధంగా డిజైన్ చేసిన ఈ భారీ ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల పొలాలకు సాగునీరు అందించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ పంప్‌హౌస్‌లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఒక్కో పంప్‌హౌస్ వద్ద భారీ సబ్స్టేషన్లు నిర్మించారు. ఇవి కూడా ఒక రికార్డే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని ఒకే ఒక కారణంతో పడావు పెట్టారనే విమర్శలున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని రిజర్వాయర్లు
నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన నార్లాపూర్ రిజర్వాయర్ పంప్‌హౌస్‌లు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నేరుగా నార్లాపూర్ పంప్‌హౌస్ నుంచి 104 మీటర్ల ఎత్తున 10 భారీ మోటర్లతో పంపింగ్ చేసి సమీపంలోని రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 8.51 టీఎంసీలు. ఇదే మెయిన్ రిజర్వాయర్. ఇక్కడినుంచి కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్‌కు కూడా లింక్ కెనాల్ ఏర్పాటు చేశారు. పంప్‌హౌస్ రిజర్వాయర్ ప్రధాన కాలువకు సుమారు 3 వేల ఎకరాలు సేకరించారు. ఇందుకు రూ.6వేల కోట్లకుపైనే ఖర్చు చేశారు.
ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్
వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇది రెండో రిజర్వాయర్. నీటి నిల్వ సామర్థ్యం 6.55 టీఎంసీలు. మొత్తం ఖర్చు 5,000 కోట్లు (సుమారుగా) ఉండగా.. 5,495 ఎకరాలు భూములు మునిగాయి. బండరాయిపాకుల, కొంకలపల్లి గ్రామాలు రిజర్వాయర్‌లో మునిగిపోయాయి. ఈ రెండు గ్రామాలకు రూ.138 కోట్లతో పునరావాసం కల్పించారు. నార్లాపూర్లోని మెయిన్ కెనాల్ నుంచి గ్రావిటీ ద్వారా ఇక్కడి పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చి చేరుతాయి. 124 మీటర్ల ఎత్తున లిఫ్ట్ చేసి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
వట్టెం (వెంకటాద్రి ) రిజర్వాయర్
దీనిని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం సమీపంలో నిర్మించారు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.55 టీఎంసీలు. ఏదుల రిజర్వాయర్ నుంచి టన్నెళ్ల ద్వారా పంపుహౌస్‌కు చేరుతాయి. 121 మీటర్ల ఎత్తున ఎత్తిపోస్తారు. మొత్తం 5,400 ఎకరాలు సేకరించారు. నిర్మాణ అంచనా వ్యయం సుమారు రూ.6వేల కోట్లు.
కరివెన (కురుమూర్తి రాయ) రిజర్వాయర్
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామ శివారులో ఉంటుంది. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.3,300 కోట్లు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 19 టీఎంసీలు. మొత్తం నాలుగు తండాలు నీట మునిగాయి. ఈ రిజర్వాయర్‌కు వట్టెం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు చేరుతాయి. వాస్తవంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రిజర్వాయర్ లేదు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఈ రిజర్వాయర్ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. నిర్వాసితులను కూడా ఒప్పించి వారికి కావాల్సిన పరిహారం కూడా అందజేసి ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి వివాదరహితమైన భూసేకరణ చేపట్టారు. ఇక్కడినుంచి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ పంప్‌హౌస్‌కు నీళ్లు చేరుతాయి. ఈ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ద్వారా మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు తాగునీరు అందుతుంది.
ఉద్దండాపూర్ రిజర్వాయర్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఈ రిజర్వాయర్ ఉంటుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 19 టీఎంసీలు. పంప్ హౌస్, సర్జ్‌పూల్, రిజర్వాయర్ నిర్మాణ అంచనా వ్యయం రూ.8,000 కోట్లు. సుమారు 6,000 ఎకరాల భూమిని సేకరించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడినుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కాలువలు ప్రారంభమవుతాయి. రైట్, లెఫ్ట్ కెనాల్ ద్వారా సుమారు నాలుగు లక్షల ఎకరాలకుపైగా నీళ్లు అందుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుడి, ఎడమ కాలువలకు టెండర్లు పిలువగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రిజర్వాయర్ నుంచి సీఎం నియోజకవర్గానికి కూడా సాగునీళ్లు అందుతాయి.

అంజనగిరి నిర్వాసిత కాలనీ..
ఈ ఇండ్లను చూస్తుంటే ఎక్కడో పట్టణాల్లో ఉన్నాయనే అభిప్రాయం కలుగుతుంది. కానీ, ఇవి నిర్వాసితుల కాలనీలు! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీల కింద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలతోపాటు సొంతంగా మరికొంత డబ్బులు వేసి ఇండ్లను ఈ విధంగా నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు. నార్లాపూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన అంజనగిరి గ్రామం కోసం మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువకు ఆనుకొని ఎత్తయిన ప్రదేశంలో దీన్ని నిర్మించారు. ఈ ఇండ్లపైకి ఎక్కి చూస్తే వెనుక శ్రీశైలం జలాలు, ఒకవైపు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువ ముందు భాగంలో నార్లాపూర్ రిజర్వాయర్.. మరోవైపు ఎల్లూరు రిజర్వాయర్లు కనిపిస్తాయి.

బండరాయిపాకల నిర్వాసిత గ్రామం
ఇది ఏదుల రిజర్వాయర్ కింద ముంపునకు గురైన బండరాయిపాకల గ్రామస్తుల కోసం నిర్మించిన కాలనీ. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఈ రిజర్వాయర్ కింద ముంపునకు గురికావడంతో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో నిర్వాసితులు ఇలా ఆధునిక హంగులతో ఇండ్లు నిర్మించుకున్నారు. కోడేరు మండలం తీగలపల్లి గ్రామ సమీపంలో ఈ కాలనీ వెలిసింది. వీళ్లంతా నిర్వాసితులు అంటే నమ్ముతారా? రైతులు, రైతు కూలీలు, అన్ని వర్గాల ప్రజలకు కోరిన విధంగా పరిహారం అందజేసి ఊరు కోల్పోయిన వారు ఆత్మగౌరవంతో జీవించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది.

ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికీ అధికారుల సమాచారం మేరకు పాలమూరు ప్రాజెక్టులకు భూసేకరణ జరుగలేదు.. పనులు చేసి ఎక్కడికక్కడే వదిలేసి పోయిండ్రు. భూ సేకరణ చేయని ప్రాజెక్టులో నీళ్లెట్ల తెచ్చి నింపాలె?– ఈ నెల 5న మహబూబ్‌నగర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి