హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. పదవీ విరమణానంతర ప్రయోజనాలు అందక నరకయాతన పడుతున్నారని వాపోయారు. ఇప్పటికి కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసి 250మంది గుండెపగిలి మరణించారని తెలిపారు. తెలంగాణభవన్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో ఉద్యోగులు కీలకభూమిక పోషించారని, సకల జనుల సమ్మె విజయవంతం చేసి రాష్ట్ర ప్రజల వాణిని ఢిల్లీకి వినిపించారని గుర్తుచేశారు. కేసీఆర్ వారిని కడుపులో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఫిట్మెంట్లు, పీఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లకు కూడా పీఆర్సీ వర్తింపజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని, డీఏలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. గద్దెనెక్కిన తర్వాత నట్టేట ముంచుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. రిటైర్ అయిన 10వేల మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. 250మంది మరణాలకు కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం వాడుకుంటున్నదని మండిపడ్డారు. వెంటనే పీఆర్సీ వేసి 44శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్‌చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అనారోగ్యంపాలైనా చికిత్స చేయించుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. ఉద్యోగుల బతుకుల్లో ఆ నందం నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.
రాష్ట్రంలోని ఉద్యోగులకు న్యాయం జరగలాంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒకటో తారీఖున వేతనాలిస్తామని ఊదరగొట్టి మొండిచెయ్యి చూపుతున్నదని ధ్వజమెత్తారు. బీసీ హాస్టళ్లు, అంగన్వాడీ భవనాల అద్దెలను కూడా పెండింగ్‌లో పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఉప ఎన్నిక ఉన్నదనే డిప్యూటీ సీఎం ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు నిధులు విడుదల చేశామని ఉట్టి మాటలు చెబుతున్నారని ఆరోపించారు. చివరకు రవీంద్రభారతిలో సీఎం చేతులమీదుగా నియామకపత్రాలు ఇచ్చిన ఉద్యోగులకు కూడా మూడునెలలుగా వేతనాలివ్వలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు భుజంగరావు, సుమిత్రాఆనంద్ తనోబా, హమీద్, వేణుగోపాలస్వామి పాల్గొన్నారు.