హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను మార్చి 31లోగా తొలగించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఇప్పటికే పలుశాఖల్లో రిటైర్డ్ అయిన వారికి ఉద్వాసన పలికారు. కానీ మంగళవారం వరకు ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లను మాత్రం తొలగించకపోవడం గమనార్హం.
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్లు సైతం ఆదేశాలు రావడమే తరువాయి, వైదొలగేందుకు తట్టా బుట్టా సర్దుకున్నారు. కానీ వారిని తొలగిస్తున్నట్టు విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మొత్తంగా సర్కారు ఉత్తర్వులను విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులే ఖాతరు చేయకపోవడం గమనార్హం.