హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ జిల్లాలో పనిచేసిన ఓ ఉద్యోగి ఇటీవల రిటైర్ అయ్యారు. అనారోగ్యంతో దవాఖానలో చూపించుకోగా.. క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా అందలేదు. ఆఖరికి దవాఖాన బిల్లులైనా ఇప్పించండి అంటూ సర్కారు పెద్దలను కలిశారు. అయినా ప్రయోజనం లేదు. ఉద్యోగ సంఘాల నేతలకు గోడు చెప్పుకున్నా పట్టించుకోలేదు. ప్రతి రోజూ ఫోన్ ద్వారానో.. వాట్సాప్ ద్వారానో వేడుకుంటూనే వచ్చారు. 22 రోజులు కన్నీరుమున్నీరైనా ఎవరూ స్పందించలేదు. దిక్కులేని పరిస్థితిలో తన తండ్రి చనిపోయాడని, మృతుడి కుమారుడు ఉద్యోగ సంఘాల వాట్సాప్ గ్రూపులో మెస్సేజ్ పెట్టడంతో నేతలంతా దిగ్భ్రాంతి చెందారు. ఇది కేవలం ఒక్క ఘటన మాత్రమే. ఇలాంటి ఉదంతాలు చాలా జరుగుతున్నాయి.
రిటైరైన తర్వాత ఒక్కో ఉద్యోగికి ప్రభు త్వం సగటున రూ.35 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ సర్కారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలొదిలారు. తీవ్ర అనారోగ్యానికి మెరుగైన చికిత్స చేయించుకునే స్థోమతలేక దీనస్థితిలో మరణించారు. బెనిఫిట్స్ వస్తాయో రావో అనే ఆవేదనతో మరికొందరు గుండె ఆగి చనిపోయారు. సాధారణంగా రిటైర్ కాగానే ఇన్నాళ్లు కూడబెట్టుకున్న డబ్బులు అందుతాయని ఉద్యోగులు ఎదురుచూస్తారు. ఆ డబ్బులు వస్తే.. పిల్లల పెండ్లిండ్లు చేయడం, అప్పులు తీర్చడం, ఇల్లు కట్టుకోవడం, దవాఖానలో మంచి చికిత్స తీసుకోవడం కోసం ఉపయోగపడతాయని భావిస్తారు. కానీ కాంగ్రెస్ సర్కారు రెండేండ్లుగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రశాంత జీవనం గడపలేని స్థితితో మగ్గిపోతున్నారు. అనారోగ్యం బారినపడ్డవారి సంగతి మరీ దారుణంగా తయారయ్యింది. కొందరు క్యాన్సర్, లివర్, కిడ్నీ, గుండె జబ్బుల వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతూ… చికిత్సకు డబ్బుల్లేక విలవిల్లాడుతున్నారు.
రాష్ట్రంలో 2024 మార్చి 31 నుంచి రిటైరైన ఉద్యోగుల వివరాలు పరిశీలిస్తే ఏడాదికి సగటున 8 వేల మంది రిటైరైనట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 16వేల మంది వరకు ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగి రిటైర్ కావడంతో లక్ష జీతం వచ్చే ఉద్యోగికి కేవలం రూ.40 వేలు మాత్రమే పెన్షన్ అందుతుంది. ప్రభుత్వం రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 11వేల కోట్లు అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వం అరకొరగా నెలకు రూ.700 కోట్లు పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తున్నది. ఈ మొత్తాన్ని నెలకు రూ.1,500 కోట్లకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిటైరై ప్రశాంత జీవితం గడపాల్సిన వారు.. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజధానిలోని సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏండ్ల తరబడి కూడబెట్టుకున్న డబ్బులు చేతికి అందక ఆవేదన చెందుతున్నారు.
