హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): బీసీలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరిట డ్రామాలు ఆడుతున్నదని ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి మండిపడ్డారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం కాదని, చారిత్రక తప్పిదమని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నాడు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్‌ను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. వాస్తవానికి ఈ అంశంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు అవగాహనే లేదని దుయ్యబట్టారు. అందుకే కులగణన, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ రోజుకో విధానం, పూటకో పద్ధతిని అవలంబిస్తున్నారని విమర్శించారు.
గత నాలుగైదు నెలల నుంచి బీసీల్లో చైతన్యం వెల్లివిరుస్తున్నదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దెబ్బతింటామనే భయానికి తోడు బీసీ సంఘాల నాయకుల ఒత్తిడితోనే ఇప్పుడు జీవోను తెరపైకి తెచ్చి తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వర్తింపు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న తప్పిదాలు, కేంద్రంలోని బీజేపీ ఎత్తుగడలు, ఆర్డినెన్స్ జారీకి ఎదురయ్యే ఇబ్బందులను సోదాహరణంగా వివరించారు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీసీలకు 42 శాతం కోటాను తెరపైకి తెచ్చింది. ఢిల్లీలోని ఆ పార్టీ నాయకత్వం కొంతకాలంగా సోషల్ జస్టిస్ నినాదాన్ని వినిపిస్తున్నది. కానీ రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులకు సామాజిక న్యాయంపై అవగాహనలేదు. అందుకే బీసీలకు 42 శాతం కోటాపై చిత్తశుద్ధి చూపడం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు. కులగణన నిర్వహణలోనూ పూర్తిగా సఫలీకృతం కాలేకపోయారు. ఒక తప్పును కప్పిపుచ్చుకొనే క్రమంలో అనేక చారిత్రక తప్పులు చేస్తున్నారు. నిజంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే కేంద్రంలోని బీజేపీని ఒప్పించి, ఒత్తిడి పెంచి చట్టబద్ధత చేయాలి. కానీ అసెంబ్లీలో బిల్లులు పెట్టి చేతులు దులుపుకొన్నారు తప్పితే ఆ దిశగా పెద్దగా చేసిందేమీలేదు.
స్థానిక ఎన్నికల్లోగాని, విద్య, ఉద్యోగాల్లోగాని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంతా ఆషామాషీ విషయం కాదని కాంగ్రెస్‌కు తెలుసు. కానీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినందున తాము ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నామని, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని బలహీనవర్గాలను నమ్మించాలని చూస్తున్నది. అందుకే మొదట కులగణన, బీసీ కమిషన్, డెడికేషన్ కమిషన్, ఇప్పుడు ఆర్డినెన్స్ అంటూ డ్రామాలు చేస్తున్నది. కేవలం లోకల్‌బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే నాటకమాడుతున్నదనేది నిర్వివాదంశం. దురదృష్టమేంటంటే కొందరు బీసీ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి వంతపాడడం విడ్డూరంగా ఉన్నది.
బీసీలకు స్థానిక ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపించారు. ఈ ప్రాసెస్ కూడా సరిగ్గా చేయలేదని అనిపిస్తున్నది. పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందకుండా రాష్ట్రపతికి పంపండం వల్ల ఒనగూరేదేమీ ఉండదు. ఇది రాజకీయంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప బీసీలకు జరిగే మేలేం లేదు. ఇప్పుడు బీసీ బిల్లులను పక్కనబెట్టి ఆర్డినెన్స్ తేవాలనుకోవడం తెలివిలేని నిర్ణయం. దీనిపై ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్తే మళ్లీ ప్రక్రియ మొదటికొచ్చే ప్రమాదం ఉన్నది. ఇది బీసీలను మోసం చేయడం తప్ప మరోటి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కండ్లు తెరిచి చిత్తశుద్ధితో బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో లేదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి మద్దతు తెలిపితే ఆ పార్టీ కూడా కాంగ్రెస్ ట్రాప్‌లో పడిందని ప్రజలు భావించవచ్చు. అలాగే ఆ పార్టీపై దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుంది. అనేక రాష్ర్టాల నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో బీసీ బిల్లుపై వెనకడుగు వేయవచ్చు.
బీసీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాల ట్రాప్‌లో పడవద్దు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని రాజకీయంగా మరింత ఒత్తిడి పెంచాలి. అంతేగాని తాత్కాలిక ప్రయోజనాల కోసం బీసీ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టవద్దు. అటు ఎన్నికల్లో, ఇటు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా సాధించేందుకు న్యాయ పోరాటం, ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.
వాస్తవానికి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే పార్లమెంట్లో చట్టం చేయడమే శరణ్యం. ఇంతకు మించిన ఆప్షన్ లేదు. ఇది సాధ్యం కాదని తెలియడంతో ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసి ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇందులో బీసీ సంఘాలు, ప్రతిపక్షాలను ఏమార్చే ప్రయత్నం కనిపిస్తున్నది. ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుంది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని స్పష్టంగా పలుమార్లు తీర్పులను వెలువరించింది. జీవోతో ఒరిగేదేమీ ఉండదని నా అభిప్రాయం. మరికొంతకాలమైతేనే స్పష్టత వచ్చే అవకాశమున్నది.