నల్లగొండ: నాగార్జునసాగర్‌లో (Nagarjuna Sagar) పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్ అందాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు. దీంతో ప్రధాన డ్యామ్, పవర్ హౌస్ పరిసరాల్లో వెళ్లకుండా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ గేట్లను ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో డ్యామ్ పైనుంచి కృష్ణమ కిందికి దూకుతుండగా చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో సాగర్‌కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వారిని డ్యామ్ పరిసరాల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
కాగా, సాగర్ జలాశయానికి క్రమంగా వరద తగ్గుతున్నది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేమొత్తంలో నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.30 అడుగుల వద్ద ఉన్నది. ఇక ప్రాజెక్టులో 305.6 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే ఇప్పుడు 312.50 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కాగా, తుంగభద్ర డ్యామ్ గేట్లు తెరవడంతో భారీగా వరద వస్తున్నది. ఆదివారం సాయంత్రానికి వరద నీరు శ్రీశైళం ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో నాగార్జున సాగర్‌కు కూడా వరద్ పెరిగే అవకాశం ఉన్నది.