ఆరు దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ ‘గుడ్డిదీపం’గా మారిపోయింది. కరెంటు కోతలు, అర్ధరాత్రి చేన్లకాడ జాగారాలు, పవర్‌హాలిడేలు! కరెంటు తీగలు బట్టలారేసుకునేలా దయనీయ స్థితి! తెలంగాణ వస్తే కరెంటు ఉండదు. రాష్ట్రం చీకటి గుయ్యారమైపోతదన్న సమైక్య పాలకుల గూబ గుయ్యుమనేలా పదేండ్లలోనే కోటి వెలుగుల తెలంగాణను కేసీఆర్‌ను సృష్టించారు. రెప్పపాటు కూడా కరెంటుపోని స్థితికి రాష్ర్టాన్ని చేర్చారు. కండ్లుండీ నిజాన్ని చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు. దీపం కిందున్న చీకటిని భూతద్దంలో చూపించి సాగించిన అబద్ధాల ప్రచారాన్ని ఆర్బీఐ తాజా నివేదిక బద్దలుకొట్టింది. పదేండ్ల వెలుగుల ప్రస్థానాన్ని, కేసీఆర్ ప్రయత్నాన్ని ఎలుగెత్తి చాటింది. కానీ.. ఇప్పుడేమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలోనే కరెంటు కథ మళ్లీ మొదటికి వచ్చింది.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ అప్పటి బీఆర్ఎస్ సర్కారు చెప్తే అవన్నీ అబద్ధాలంటూ కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. నిజాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే. కేసీఆర్‌పాలనలో విద్యుత్తు రంగంలో జరిగిన గొప్ప మార్పులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా వెల్లడించింది. దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగం, తొమ్మిదిన్నరేండ్ల కాలంలోనే స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఏ విధంగా రికార్డు సాధించిందో వివరించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అంటే 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,151 యూనిట్లుగా ఉంటే, 2023-24 నాటికి ఇది 2,398 యూనిట్లకు (108 శాతం పెరుగుదల) చేరినట్టు ఆర్బీ ఐ నివేదిక పేర్కొంది. మరోవైపు, 2014-15లో తెలంగాణలో 9,470 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం.. 023-24నాటికి 19,519 మెగావాట్లకు (106 శాతం పెరుగుదల) చేరినట్టు వివరించింది.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం పెరుగుదల చూసుకున్నా తలసరి విద్యుత్తు వినియోగంలో నమోదైన పెరుగుదలను చూసుకున్నా దేశంలోని అన్ని ప్రధాన రాష్ర్టాల కంటే తెలంగాణనే ఎంతో ముందున్నట్టు అర్థమవుతున్నది. దేశంలో సగటు తలసరి విద్యుత్తు వినియోగం 1,340 యూనిట్లుగా నమోదైతే, తెలంగాణలో ఇది 2,398 యూనిట్లుగా నమోదుకావడం గమనార్హం. అంటే దేశీయ తలసరి విద్యుత్తు వినియోగంతో పోలిస్తే తెలంగాణ పౌరుడు సగటున 1,058 యూనిట్ల ఎక్కువ కరెంటును వినియోగించుకొంటున్నట్టు అర్థంచేసుకోవచ్చు. ఇది అభివృద్ధికి సూచిక.
ఏ దేశమైనా లేదా రాష్ట్రమైనా ఆర్థికంగా, సామాజికంగా సర్వోన్నతాభివృద్ధి సాధించాలంటే నిరంతరాయ విద్యుత్తు సరఫరా కీలకమని నిపుణులు చెప్తారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో రాష్ట్రం ఏర్పడిన కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే కోతలు లేని తెలంగాణ సుసాధ్యమైంది. 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరా సాకారమైంది. స్థాపిత విద్యుత్తు సామర్థ్యం అంచనాలకు మించి అందుబాటులోకి వచ్చింది. నిరంతరాయ విద్యుత్తు సరఫరా జరగడం, పవర్ కట్స్ లేకపోవడంతో హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు కొలువుదీరాయి. మూతబడ్డ కంపెనీలు తెరుచుకొన్నాయి. ప్రజలకు చేతినిండా పని దొరికింది. ఏటా లక్షల మోటార్లు కాలే స్థితి నుంచి సాగునీటితో పంట పొలాలు కళకళలాడే రోజులు వచ్చాయి. పారిశ్రామిక, వ్యావసాయిక ప్రగతి జరిగింది. దేశానికే తెలంగాణ ధాన్యాగారమైంది. ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు మాయమై.. హైదరాబాద్ వంటి నగరాలే కాదు ఆదిలాబాద్‌లోని కుగ్రామాలు కూడా నిరంతరాయ విద్యుత్తు వెలుగులతో ధగధగలాడాయి. తెలంగాణలో ‘ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త’ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.
కోతలులేని తెలంగాణ ఒక్కరోజులోనే సాకారమైందనుకొంటే పొరపాటే. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి గడిగడికి కరెంటు పోయేది. చిమ్మచీకట్లో, దీపం వెలుతురులో పొయ్యి మీద బువ్వ వండిన దినాలు ఇప్పటికీ గుర్తే. నీళ్లు పెడుదామని పొలం కాడికి రాత్రిళ్లు పోయిన రైతన్నలకు పురుగు పుట్ర, పాములు కరిచిన ఉదంతాలెన్నెన్నో ఉన్నాయి. కంపెనీలకు పవర్ హాలీడేలు నిత్యకృత్యమయ్యాయి. సమైక్య పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్తు సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. మండల కేంద్రాల్లోనూ 8 గంటల పాటు కరెంటు కోతలుండేవి. మున్సిపాలిటీల్లో 6 గంటల పాటు, హైదరాబాద్‌లోనూ 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. పారిశ్రామికరంగం పరిస్థితి మరీ దారుణం. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించిన రోజులవి. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. తెలంగాణకు విద్యుత్తు ప్రాణావసరమని, ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కరెంటు వాడకం ఎక్కువనీ, అందువల్ల విద్యుత్తు పంపకంలో తెలంగాణ రాష్ర్టానికి అధిక వాటా కేటాయించాలని రాష్ట్ర ఏర్పాటు చర్చల్లో తెలంగాణ నేతలు గట్టిగా వాదించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో 53.89 (దాదాపు 54 శాతాన్ని) తెలంగాణకు, 46.11 శాతాన్ని విభజిత ఏపీకి కేటాయించింది. ఉమ్మడి ఏపీలో 2014కు ముందు ఐదేండ్ల కరెంటు వాడకాన్ని పరిగణనలోకి తీసుకొని మరీ కేంద్రం ఈ వాటాలను ఖరారు చేసింది. దీన్ని కచ్చితంగా పాటించాలని కూడా రాష్ట్ర విభజన చట్టంలో సుస్పష్టంగా పేర్కొన్నది.
గత ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ ప్రైవేట్ రంగంలో విద్యుత్తు ఉత్పాదనను ప్రోత్సహించాయి. కానీ కేసీఆర్ సర్కారు ప్రభుత్వ రంగంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని ప్లాంట్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చింది. విద్యుదుత్పత్తిలో స్వావలంబన సాధిస్తేనే తెలంగాణకు కరెంటు కష్టాలు తీరడంతో పాటు అన్నిరంగాల్లో రాష్ర్టం అభివద్ధి పథంలో ముందుకుపోతుందని గ్రహించిన కేసీఆర్ స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యుత్తు కేంద్రాల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడినప్పుడు కేవలం 9,470 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం కేసీఆర్ దూరదృష్టితో తొమ్మిదిన్నరేండ్లలోనే 106 శాతం వరకూ పెరిగి 19,519మెగావాట్లకు చేరుకున్నది. కేసీఆర్ దృఢ సంకల్పం, పటిష్ఠమైన కార్యాచరణతో కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, లోయర్ జూరాల నుంచి 240 మెగావాట్లు, పులిచింతల నుంచి 120 మెగావాట్లు, కేటీపీఎస్ (స్టేజ్-7) నుంచి 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 1,080 మెగావాట్లు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 1,200 మెగావాట్లు, సౌర విద్యుత్తు నుంచి 6,106 మెగావాట్లు, పవన విద్యుత్తు నుంచి మరో 128 మెగావాట్లు ఇలా మొత్తంగా నిరుడు అక్టోబర్ 1 నాటికి తెలంగాణలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 19,519 మెగావాట్లకు పెరిగింది. దేశంలోనే ఇది రికార్డు. ఇదే పదేండ్ల సమయంలో దేశంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం కేవలం 69 శాతం మేర పెరగడం గమనార్హం. 2014లో రాష్ర్టం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1151 యూనిట్లుగా ఉంటే, తొమ్మిదిన్నరేండ్లలోనే అది 2,398యూనిట్లకు పెరిగింది.
ఇది కాంగ్రెస్ ప్రశ్న
కరెంటు కోతలులేని రాష్ర్టాన్ని దేశానికి పరిచయం చేసిండు.
అన్ని రంగాలకు 24 గంటల కరంటు సరఫరా చేసిండు.
దేశంలోనే మొదటిసారి సాగుకు నిరంతర విద్యుత్తు అందించిండు.
కంపెనీలకు పవర్హాలీడేలు లేకుండా చూసిండు.
దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగం ఉన్న రాష్ట్రంగా మార్చిండు.
ఇవన్నీ బీఆర్ఎస్ చెప్పుకునే గొప్పలు మాత్రమే కాదు.. ఆర్బీఐ తాజాగా వెల్లడించిన వాస్తవాలు.
పదేండ్లలో విద్యుత్తు రంగాన్ని కేసీఆర్ నిర్లక్ష్య చేశారన్న విమర్శలకు సమాధానాలు.
తెలంగాణలో కరెంటు డిమాండ్-సప్లయ్ మధ్య భారీ అంతరం ఏర్పడింది. రాష్ర్టంగా ఏర్పడేనాటికి తెలంగాణలో అందుబాటు లో ఉన్న మొత్తం విద్యుత్తు కచ్చితంగా చెప్పాలంటే 4155.5 మెగావాట్లు మాత్రమే. అప్పటి (2014) వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2,700 మెగావాట్ల కొరత ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1,500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2,400 మెగావాట్ల లోటు ఏర్ప డింది. వెరసి మొత్తమ్మీద సుమారు 5,000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్తు రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో నాటి తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించింది. రాష్ర్టం చీకట్లో మగ్గకుండా, తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడ కరెంటు దొరికితే అక్కడ కొనాలని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలో అధికారుల పరిశీలనలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మిగులు విద్యుత్తు ఉన్నట్టు తేలింది. ఈ రెండింటిలో ఛత్తీస్‌గఢ్ తెలంగాణకు పొరుగునే ఉన్నది. దీంతో 2014లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ కొనుగోలు చేయడానికి రెండు రాష్ట్రాల విద్యుత్తు కార్యదర్శుల మధ్య ఒప్పందం కుదిరింది. అలా కరెంటు కష్టాలు కొంతవరకు తీరాయి.
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది. ఆ చీకటి రోజుల నుంచి స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. తొమ్మిదిన్నరేండ్లలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలతోపాటు గృహావసరాలకు కూడా 24 గంటలూ నాణ్యమైన కరెంట్ అందించింది కేసీఆర్ సర్కారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు రంగం గాడి తప్పింది. కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. గత వేసవిలో పవర్ కట్లతో పారిశ్రామిక రంగం కుదేలయ్యింది. పారిశ్రామికవేత్తలు, చిరువ్యాపారులు, కుటీర పరిశ్రమలు యంత్రాలను నడిపించి జీవనోపాధి పొందే వారు తీవ్రంగా నష్టపోయారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యనేతల సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా కరెంట్ కట్ అయిన ఘటనలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
అయితే తదనంతర పరిణామాలు ఇందుకు భిన్నంగా జరిగాయి. నాటి సమైక్య పాలకులు, ఆంధ్రా పార్టీలు, నాయకుల అభీష్టానికి విరుద్ధంగా ఏర్పాటైన తెలంగాణను ఎలాగైనా విఫల రాష్ట్రంగా చూపించడానికి సమైక్య పాలకులు కంకణం కట్టుకున్నారు. తెలంగాణను దెబ్బకొట్టడానికి వారు ఎంచుకున్న మొట్టమొదటి అస్త్రం కరెంటు. ఆంధ్రాతో కలిసి లేకుంటే తెలంగాణ చీకట్లో మగ్గిపోతుందని అంతకుముందే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ హెచ్చరికలు జారీచేసిన సమైక్య పాలకులు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్నంత పనీ చేయడానికి తెగబడ్డారు. కరెంటు లేకుంటే తెలంగాణ బతుకలేని, చావలేని దయనీయ స్థితిలో పడుతుందనే ఎత్తుగడ వేసి, పెను దుర్మార్గానికి తెరతీశారు.
ఇందులో భాగంగా రాష్ట్ర విభజన చట్టాన్ని నిర్లజ్జగా ఉల్లంఘించారు. నాటి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి, విభజన చట్టాన్ని తుంగలో తొక్కి, తెలంగాణ (ఖమ్మం జిల్లాలోని) 7 మండలాలతో పాటు సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాన్ని గుంజుకుపోయారు. తెలంగాణకు సీలేరు పవర్ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైనదంటే, ఏడాదిలో 300 రోజులు కరెంటు ఉత్పత్తి చేసే (అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉండే) ప్రాజెక్టు అది. అది కూడా అత్యంత అగ్గువ ఖర్చుతో. అందులో కేవలం 85 పైసలకే యూనిట్ కరెంటు ఉత్పత్తి అయ్యేది. సీలేరును ఆంధ్రా గుంజుకుపోవడంతో తెలంగాణ ఏకంగా 450 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని కోల్పోయింది. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు సరఫరాను కూడా ఆంధ్రా పాలకులు నిలిపివేశారు.
రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు కనెక్షన్లు 2014లో 1.11 కోట్లు మాత్రమే. 2023 మే 1 నాటికి మొత్తం కనెక్షన్ల సంఖ్య 1.78 కోట్లకు చేరింది.
2021-22 నాటికి జలవిద్యుత్తు ఉత్పత్తిని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లక్ష్యానికంటే రికార్డు స్థాయిలో 5654.7 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తిని తెలంగాణ జెన్కో సాధించింది.
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల 2023 కల్లా సోలార్ పవర్ ఉత్పత్తి 5,865 మెగావాట్లకు చేరింది.
మార్చి 2023లో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 15,497 మెగావాట్లను రాష్ట్రం సునాయాసంగా అధిగమించింది.
2014లో వ్యవసాయ రంగంలోని విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు మాత్రమే. కానీ 2023 మే 1 వరకు వీటి సంఖ్య 27.49 లక్షలు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 ఎకరాల స్థలం అవసరమయ్యే వాటికి, ఐదెకరాల స్థలంలో 400కేవీ, 220కేవీ, 132 కేవీ జీఐఎస్ సబ్ స్టేషన్ ఏర్పాటు.
97,321 కోట్లు వెచ్చించి విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల విస్తరణ, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేసింది.
హైదరాబాద్ నగరానికి రెప్పపాటు కోతల్లేకుండా 400 కేవీ, 200 కేవీ, 132కేవీ రింగ్ మెయిన్ సిస్టం ఏర్పాటు. గ్రిడ్ విఫలమైనా అంతరాయం తలెత్తకుండా ఐలాండ్ వ్యవస్థ ఏర్పాటు.