హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బడుగు బలహీనవర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు.. మహిళలకు కూడా ధోకా ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వారికి 50 శాతం సీట్లు దక్కాల్సి ఉండగా, 45.4 శాతమే కల్పించింది. రాష్ట్రంలో జిల్లాలవారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయగా, మహిళలకు సగం సీట్లు దక్కాల్సి ఉండగా 45-46 శాతానికే పరిమితమైంది. అంటే నాలుగు శాతం సీట్లకు కోత పెట్టారు. రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, దుందుడుకు చర్యల వల్ల 584 గ్రామాల్లో మహిళలు సర్పంచులు అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా 32 గ్రామాలను మినహాయించి 12,728 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల్లోని మొత్తం స్థానాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవుల్లో మహిళలకు 50శాతం(సగం) రిజర్వేషన్లు కల్పించాలి. ఈ 50శాతం రిజర్వేషన్లు క్షేత్ర సమాంతరంగా అమలవుతుంది. అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాల్లో రిజర్వ్ చేయబడిన ప్రతి క్యాటగిరీలోనూ సగం స్థానాలు ఆయా వర్గాల మహిళలకు కేటాయించాల్సిందే. ఈ చట్టంలోని సెక్షన్-17 సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు, సెక్షన్-9 వార్డు మెంబర్ల సీట్ల రిజర్వేషన్ల గురించి వివరిస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహించబోయే 12,728 సర్పంచ్ స్థానాలకు గాను మహిళలు సగం సీట్లు అంటే 6,364 స్థానాల్లో ప్రాతినిధ్యం వహించాలి. కానీ 5,780(45.41 శాతం) సీట్లు మాత్రమే దక్కాయి. 584 గ్రామాల్లో వారికి సర్పంచ్ పదవులు దక్కకుండా పోయాయి. ఇక 1,12,242 వార్డులకు గాను 56,121 వార్డులు మహిళలకే దక్కాలి. కానీ, చట్టం ప్రకారం మహిళలకు దక్కలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టిన రిజర్వేషన్ల నోటిఫికేషన్లను పరిశీలిస్తే రిజర్వేషన్ల విషయంలో మహిళలకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 81,42,231 మంది కాగా, మహిళలు 85,12,455 మంది, ఇతరులు 500 ఉన్నారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే 3,70,244 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 49.09 శాతం రిజర్వేషన్లు దక్కాయి. సర్పంచ్లు, వార్డుల సభ్యులుగా ఎన్నికైనవారిలో సుమారు సగం మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారికి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న ధనసరి అనసూయ సీతక్క సొంత జిల్లా ములుగులోనూ మహిళలకు అన్యాయమే జరిగింది. ములుగు జిల్లాలోని 146 జీపీల్లో మహిళలకు 73 సర్పంచ్ సీట్లు రావాల్సి ఉండగా, 65 మాత్రమే దక్కాయి. అంటే ఎనిమిది చోట్ల సర్పంచ్ ప్రాతినిధ్యం కోల్పోయారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళా ప్రాతినిధ్యం ఈసారి గణనీయంగా తగ్గింది. అయితే, అధికారులు మాత్రం.. మండలాన్ని కేంద్రంగా తీసుకొని రిజర్వేషన్లు కేటాయించామని తెలిపారు. ఒక మండలంలో 15 గ్రామాలు ఉన్నాయనుకుంటే.. ఏడు సర్పంచ్ స్థానాలు పురుషులకు, మరో ఏడు మహిళలకు కేటాయించామని, మిగిలిన ఒక్క స్థానాన్ని మహిళలకు కేటాయించే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో మహిళా రిజర్వేషన్లు కొంత శాతం మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.