SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో 37వ రోజు రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ.. సహాయక బృందాలకు తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ నాడు కుటుంబాలకు దూరంగా ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా వివిధ రకాల నిష్ణాతులైన సిబ్బందిని, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. మొదటి రోజు నుంచే టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ చేయగల ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే, జీఎస్ ఐ, ఎన్జీఆర్ ఐ, ర్యాట్ హోల్ మైనర్స్ , ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు, కేరళ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్, రోబోటిక్ సహా అన్ని రకాల నిష్ణాతులను, సాంకేతికతను ఉపయోగించుకుంటూ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రతి రోజూ నిరంతరాయంగా కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ, పలు సూచనలు, సలహాలు అందజేస్తూ సహాయక పనులను వేగవంతం చేస్తున్నామని శివశంకర్ వివరించారు . నిర్విరామంగా డీ వాటరింగ్, ప్రక్రియలను చేపడుతూ, సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నామని తెలిపారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నట్లు ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి తెలియజేశారు.