హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రుణమాఫీని ఎగ్గొట్టేలా, రైతులను మోసం చేసేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీకి రేషన్‌కార్డును, కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్‌కార్డు లేకుండా వ్యవసాయ రుణం పొందినవారు అర్హులు కారా? అని ప్రశ్నించారు. రెండు బ్యాంకుల్లో రుణం తీసుకుని, ఒక బ్యాంకులో రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ అనడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు రైతుల మెడపై కత్తిపెట్టి చెల్లించమంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల పేరున ఉన్న రుణాలకే ప్రాధాన్యం ఇస్తామనడం చూస్తుంటే ఇది రాజకీయ ప్రకటన అనిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను బట్టి 40 శాతం మంది రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని, మిగతా 60 శాతం మంది రైతులు మోస పోయినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. రీషెడ్యూల్ అయిన రుణాలకు రుణమాఫీ వర్తించదని చెప్పడం కూడా మోసమేనని పేర్కొన్నారు. రైతు ఏ బ్యాంకులో రుణం తీసుకున్నా రూ. 2 లక్షలు మాఫీ చేయాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరని, మంత్రులు జిల్లాలకు రాలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. రైతులు రోడ్లపైకి రావడానికి ముందే మార్గదర్శకాలను రద్దు చేయాలని సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.