రంగారెడ్డి, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్ తీరు కంచె చేను మేసినట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రూ.7వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. భూములను కాపాడే విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ప్రశ్నించారు.
ఈ భూముల్లో 600మంది రైతులు ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్నారని, కానీ ఇటీవల కొంతమంది ప్రభుత్వ అండదండలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రైతులు ఆ భూమిలోకి రాకుండా బౌన్సర్లు, గూండాలను పెట్టి అడ్డుకొని దాడులు చేస్తున్నా పోలీసులు మాత్రం ఆక్రమణదారులకే మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తుంగలో తొక్కి భూమిని కాజేసేందుకు తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు, హైకోర్టు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదని, స్టే ఇవ్వాలని ప్రైవేట్ వ్యక్తులు కోరినా కోర్టు తిరస్కరించిందని తెలిపారు. అయినా దర్జాగా నిర్మాణాలు చేపడుతూ, కుంటను ధ్వంసం చేసినా అధికారులు వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ధ్వజమెత్తారు.
హైడ్రా తీరు ఆశ్చర్యకరంగా ఉంది
పేదల ఇండ్లను క్షణాల్లో కూల్చేసే హైడ్రా అధికారులు, నాదర్గుల్ భూమి కబ్జాపై ఎందుకు స్పందించటం లేదని బీఆర్ఎస్ ప్రతినిధులు ప్రశ్నించారు. కబ్జాపై ఫిర్యాదు చేస్తే హైడ్రా చీఫ్ రంగనాథ్ మాత్రం అవి ప్రైవేట్ భూములని చెప్పటం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇరిగేషన్ రికార్డులో చెరువు ఉన్నదని, కానీ ప్రైవేట్ వ్యక్తులు నామరూపాలు లేకుండా చేసినా హైడ్రా స్పందించకపోవటం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నారు. నాదర్గుల్లోని భూ స్కామ్‌లో రెవెన్యూ మంత్రికి సంబంధం లేకపోతే, వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఫ్యూచర్‌సిటీ పేరుతో భూములు కొల్లగొడుతున్నరు : సబితాఇంద్రారెడ్డి
ఫ్యూచర్‌సిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని వాటిని పెట్టుబడిదారులకు కట్టబెట్టి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి దుయ్యబట్టారు. జిల్లాలో వేలాది ఎకరాలను ముఖ్యమంత్రి తన అనుకూల సంస్థలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.