హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్లు, జిల్లాల, సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను ఎప్పటికప్పుడు సరిచేసి వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ 2,770 స్తంభాలు, 34 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, అన్నింటినీ పునరుద్ధరించినట్టు చెప్పారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, సెలవు రోజుల్లోనూ అందుబాటులోనే ఉండాలని ఆదేశించారు. జిల్లాల, సరిళ్ల హెడ్ క్వార్టర్లు, హైదరాబాద్లోని సాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో..
ఎన్పీడీసీఎల్ పరిధిలో మరమ్మతుకు గురైన 2,787 స్తంభాలు, 450 ట్రాన్స్ఫార్మర్లు, 140 సబ్స్టేషన్లను పునరుద్ధరించామని ఆ సంస్థ సీఎండీ అన్నమనేని గోపాల్రావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ కార్యాలయం నుంచి డైరెక్టర్లు, 16 సర్కిళ్ల ఎస్ఈలతో సమీక్ష నిర్వహించారు. సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ల(1800 425 0028, 1912)లో సంప్రదించాలని సూచించారు.