Telangana | హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని స్టేట్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వేసవిలోనే మరమ్మతులు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. వాహనదారుల నుంచి విమర్శలు రావడంతో అక్కడక్కడ తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. వర్షాకాలం మొదలు కావడంతో ఇప్పుడు పనులు ముందుకుసాగే వీలు లేదని అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది భారీ వర్షాల కారణంగా రోడ్లు విపరీతంగా పాడవడంతో కేసీఆర్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు రూ. 2500కోట్లు కేటాయించింది. అయితే అధికారుల ఉదాశీనత వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్తో పనులు ముందుకు సాగలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. అంతేకాదు గతంలో మంజూరు చేసిన అనేక పనులను రద్దుచేశారు. దీంతో రోడ్ల మరమ్మతు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,641కిలోమీటర్లమేర రోడ్లు పాడైపోయినట్టు గుర్తించగా అందులో సగం పనులు కూడా పూర్తికాలేదు. మరమ్మతులకు మొత్తం 1170పనులు మంజూరు చేయగా, అందులో 600పైచిలుకు పనులు నిలిచిపోయాయి. అలాగే, పూర్తయిన పనులకు సంబంధించి రూ. 800కోట్ల వరకూ బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటిని కూడా చెల్లించకపోవడంతో అత్యవసర మరమ్మతులు కూడామిగిలిపోయాయి.