Handloom GST | చేనేత (Handloom)పై జీఎస్టీ (GST)ని ఎత్తివేయాలని 12 దేశాల ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయి వేదికగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ జరిగింది. సమ్మిట్‌కు 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చేనేతకు గొప్ప చరిత్ర ఉందని, స్వాతంత్ర ఉద్యమంలో చరఖా అహింసాహిత చిహ్నంగా నిలిచిందని ప్రతినిధులు పేర్కొన్నారు. 2017లో తొలిసారిగా భారత ప్రభుత్వం చేనేతపై 5శాతం జీఎస్టీ విధించిందని, దీన్ని తొలగించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో చేస్తున్న జీరో జీఎస్టీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు.
గ్లోబల్ సమ్మిట్‌లో గౌరవ అతిథిగా పాల్గొన్న జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలని గ్లోబల్ సమీట్లో భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ కూడా ఆమోదించారు. చేనేతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఎమ్మెల్సీ ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవులు, తెలంగాణ పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, కోశాధికారి కొక్కుల దేవేందర్, ఇంజినీర్స్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండురంగయ్య మాట్లాడుతూ పద్మశాలిలు ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని వివరించారు. సమావేశంలో గ్లోబల్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, అమెరికా కెనడా, ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్, ఇండియా ఇన్చార్జి సభ్యులు పాల్గొన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్, మీడియా విభాగం అధ్యక్షుడు ఆవ్వారి భాస్కర్, నక్క వేణుమాధవన్, సంకు సుధాకర్, ఈడం శ్రీనివాస్, బాసాని పద్మ, విశ్వ రేఖ, చిప్ప విజయలక్ష్మి, రాపోలు సుధాకర్, కోమటి సత్యనారాయణ, వేణు కల్యాన్ తదితరులు పాల్గొన్నారు. సమ్మిట్‌లో నూతనంగా గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ ఆవిర్భవించింది. గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ లక్ష్యాలను హరి ఇప్పనపల్లి, బాలాజీ జిల్లా, ప్రదీప్ సామల వివరించారు. దుబాయి చాప్టర్ నిర్వాహకులు పిల్లలమర్రి ప్రమోద్, గుత్తికొండ రవిచంద్ర, శరత్ చంద్ర, విజయ్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.