Telangana | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వేన వేల త్యాగాలు.. అమరుల బలిదానాలు.. 60 ఏండ్ల పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు.. వెరసి తెలంగాణ ఆవిర్భావం. జూన్ 2 తెలంగాణ జాతి చరిత్రలో ఓ అరుదైన క్షణం.. అత్యద్భుతమైన కీలక ఘట్టం. ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత్ర పుటల్లోంచి మాయం చేసే కుట్రకు కాంగ్రెస్ పూనుకున్నది. నాడు రాష్ట్ర సాధన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి ఆత్మబలిదానాలకు కారణమైన హస్తం పార్టీ నేడు ఆ ఉద్యమ చరిత్రను కూడా తుడిపేసేందుకు సిద్ధమైంది. భావి తరాలకు ఉద్యమస్ఫూర్తిని తెలపాల్సింది పోయి పాఠ్యాంశం నుంచే తొలగించింది. విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోనే ఇదంతా జరగడం గమనార్హం.
అసలేం జరిగిందంటే?
రాష్ర్టావతరణ సందర్భంగా 2014 జూన్ 2న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సంపాదకీయం ప్రచురితమైంది. దీనిని పదో తరగతి తెలుగు పుస్తకంలో (మొదటి భాష) ‘లక్ష్యసిద్ధి’ పేరుతో 8వ పాఠంగా చేర్చారు. రాష్ర్టావతరణ సందర్భంగా తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయ చేసే వ్యాసమది. భవిష్యత్తు తరాలైన మన బిడ్డలకు ఉద్యమ చరిత్రను పరిచయం చేయడంలో భాగంగా నిపుణుల కమిటీ ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. 2014 నుంచి 2024 వరకు దాదాపు పదేండ్ల పాటు ఈ పాఠాన్ని విద్యార్థులు చదివారు కూడా. 1969 నుంచి 2024 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని పత్రికలు ఎత్తిపట్టాయి. స్వరాష్ట్రం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన సందర్భంగా పత్రికలన్నీ పతాకశీర్షికలతో వార్తలను ప్రచురించి, ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. ఇదే పాఠంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్ వ్యాసాలను కూడా చదవాలని విద్యార్థులకు సూచించారు. కానీ ఏం తప్పనిపించిందో విద్యాశాఖ అధికారులు ఈ ఒక్క పాఠానికి కత్తెరపెట్టారు.
కుట్రపూరితంగా..
పదో తరగతి తెలుగు పుస్తకంలో నిరుటి వరకు మొత్తం 12 పాఠ్యాంశాలున్నాయి. 2025 -26 విద్యాసంవత్సరంలో ముద్రించిన పుస్తకాల్లో వాటిని 11 కుదించారు. పనిగట్టుకుని ఒకే ఒక్క పాఠాన్ని తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలగించిన పాఠం స్థానంలో మరో దానిని కూడా చేర్చలేదు. నిజానికి సిలబస్‌ను మార్చాలంటే ప్రభుత్వం తొలుత జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ వేసి అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఇలా గుట్టుచప్పుడు కాకుండా పాఠం తొలగించడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పుస్తకంలో మార్పులు చేసినట్టు తమకు సమాచారం లేదని, పుస్తకాలు తెరిచి చూశాకే తెలిసిందని చెప్తున్నారు.
కేసీఆర్ పేరున్నదనే అక్కసు
తొలగించిన పాఠంలో ఓ చోట కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ‘ కేసీఆర్ మొదటిరోజే ప్రకటించినట్టు పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే’ అని పాఠంలో ఉటంకించారు. పాఠంలో కేసీఆర్ పేరున్నదనే అక్కసుతోనే పాఠాన్ని తొలగించినట్టు తెలిసింది. పాఠాన్ని తొలగించినట్టు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మార్చేస్తారా? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
నిరుడు కూడా అంతే
విద్యార్థులకు నిరుడు అందజేసిన పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లు ఉండటాన్ని రేవంత్ సర్కారు జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఈ ఫొటోలున్న పేజీలు చించివేయాలని ఆదేశాలిచ్చింది. కొన్ని చోట్ల పుస్తకాల్లోని పేజీలను చింపివేశారు కూడా. అయితే అదే పేజీ వెనకాలే జాతీయ గీతం, జనగణమన ఉండటంతో ఆ తర్వాత ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నది. ఆ తర్వాత మళ్లీ నిర్ణయం మార్చుకుని స్టిక్కర్లతో ఆ ఫొటోలను మూసివేయాలని ఆదేశించింది. ఇలా ఆగమాగం ఆదేశాలిచ్చి అభాసుపాలైంది. భాషా సాంస్కృతిక శాఖ ముద్రించిన ‘తారీఖుల్లో తెలంగాణ’ పుస్తకంలో కేసీఆర్ ఫోటో ఉన్న కారణంగా ఆయా పేజీలను చింపివేసి హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో విక్రయించారు.
ఇది కూడా తప్పేనా?
రేవంత్ సర్కారు తొలగించిన పాఠంలో అభ్యంతరకర విషయాలేవీ లేవు. వ్యక్తిపూజ, రాజకీయ అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం పోరాట జ్ఞాపకాలు, గమ్యాన్ని ముద్దాడిన క్షణాలను భవిష్యత్తు తరాలకు తెలిపే ప్రయత్నం మాత్రమే ఉన్నది. భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలో నిర్దేశించింది. సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. తెలంగాణ భాష, సంస్కృతులకు మళ్లీ ప్రాణం పోయాలని, ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలని పిలుపునిచ్చింది. ఇది కూడా సర్కారు పెద్దలకు, అధికారులకు తప్పుగా అనిపించడం గమనార్హం. పదో తరగతి తెలుగు పుస్తకంలో పాఠం కత్తిరింపు అంశంపై ఆరా తీసేందుకు ఎస్సీఈర్టీ డైరెక్టర్ జీ రమేశ్‌ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.