కరీమాబాద్, అక్టోబర్ 6: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న భూవివాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండల (Warangal) పరిధి ఉర్సు శివారులో రోజుకో భూవివాదం జరుగుతున్నది. తాజాగా, సోమవారం ఉర్సు శివారు ప్రాంతంలో కొందరు యువకులు ఓ స్థలంలో ఉన్న పేరును తుడిచేసి తమకు సంబంధించిన వారి పేరు రాశారు. దీంతో అక్కడికి చేరుకున్న మరోవర్గం వారు.. ‘ఈ స్థలంలో మీకేం పని? పేరును ఎందుకు రాస్తున్నారు? ఈ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉన్నది’ అని చెప్పడంతో సదరు యువకులు వారితో వాగ్వాదానికి దిగారు.
అంతటితో ఆగకుండా ‘మేము ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) సార్ మనుషులం.. సార్ చెప్తేనే ఈ పని చేస్తున్నం’ అని బదులిచ్చారు. ఏదన్నా ఉంటే సార్‌తో మాట్లాడుకోవాలని బదులిచ్చారు. ఈ విషయాన్ని మరోవర్గం వారు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా ఎమ్మెల్యే నాగరాజు చేయిస్తున్నారా? లేదా అక్కడికి వచ్చిన యువకులు ఎమ్మెల్యే నాగరాజు పేరును వాడుకుంటున్నారా? అన్న విషయం తెలియాల్సి ఉన్నది. ఈ విషయమై మిల్స్‌కాలనీ సీఐ రమేశ్‌ను వివరణ కోరగా సదరు భూవివాదం తమ దృష్టికి రాలేదని తెలిపారు. భూ వివాదాల్లో గొడవపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.