సీఎం రేవంత్రెడ్డి మంచోడు కాదు.. ముంచేటోడు! ఇప్పటికే సగం ముంచిండు. కేసీఆర్ సార్ రాకుంటే మొత్తం ముంచేస్తడు. కేసీఆర్ ఉన్నప్పుడు పేదల బతుకులు బాగుండె. మళ్లా కేసీఆర్ సారే రావాలె.. మాకు న్యాయం చేయాలె.. – బాధితురాలు జయమ్మ
కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 10 : ‘మాలాంటి పేదలకు న్యాయం చేసేది కేసీఆర్ సారే.. సార్ను కలుస్తా.. కాళ్లు పట్టుకొని నా కష్టాన్ని చెప్పి ఆదుకోవాలని వేడుకుంటా’ అని కూల్చివేతల బాధితురాలు జయమ్మ చెప్పింది. రోడ్డు పక్కన తన కొడుకు పంచర్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, తన భర్త చనిపోయిన తర్వాత కొడుకుపైనే ఆధారపడి ఐదుగురం బతుకున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, షాపులో సామాను కూ డా తీసుకోనివ్వకుండా తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేసింది. ‘నా కడుపులో బాధ.. మా కష్టాన్ని పట్టించుకునే వారే లేరు.. ఇక్కడి కాంగ్రెస్ నా యకులు ముందుకొచ్చి చేసింది మంచిపనేనని మాకు చెప్పాలె’ అని నిలదీసింది. ఈ రోడ్డులో అందరివీ తొలగించకుండా కొందరి షాపులనే తొలగించారని, పెద్దోళ్లను వదిలిపెట్టి పేదలపై అధికారులు ప్రతాపం చూపుతున్నారని వాపోయింది. ‘మాకు సమయం ఇ స్తే.. సామాను తీసుకుని పోయేటోళ్లం.
అట్లనే కూల్చడం వల్ల లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది. మా కుటుంబమంతా రోడ్డున పడ్డది’ అంటూ లబోదిబోమని గుండెలు బాదుకున్నది. ‘మేము బతుకుదెరువు కోసం జహీరాబాద్ నుంచి వచ్చి గాజులరామారంలో అద్దెకు ఉంటున్నం. నేను ఇండ్లలో బాసన్లు తోముత. నా కొడుకు సురేశ్ రోడ్డు పక్కన చిన్న డబ్బాలో పంచర్షాప్ పెట్టుకున్నడు. కోడలు, ఇద్దరు పిల్లలు, నా చిన్న కొడుకుతో కలిసి ఆరుగురం బతుకుతున్నం’ అని వివరించింది. కాగా స్థానిక ఆటో యూనియన్ నాయకుడు, కాంగ్రెస్ నేతగా చెలామణి అవుతున్న ఓ ఒకరు పంచర్ షాపు నిర్వాహకుల వద్ద ప్రతి నెలా రూ.8వేల కిరాయి వసూలు చేస్తుండటం కొసమెరుపు.
ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు
కేపీహెచ్బీ కాలనీలోని ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగం అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మంగళవారం కేపీహెచ్బీ కాలనీలోని నెక్సస్ మాల్ చౌరస్తా నుంచి గోకుల్ ప్లాట్స్ చౌరస్తా వరకు, కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ చౌరస్తా నుంచి బ్రాండ్ ఫ్యాక్టరీ చౌరస్తా వరకు రోడ్డుకిరువైపులా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. కేపీహెచ్బీ కాలనీలో పలు ప్రధాన రహదారులకు ఇరువైపులా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను ఒక్కసారిగా జేసీబీలతో తొలగించారు.
ఆక్రమణల తొలగింపును ట్రాఫిక్ డీసీసీ వీరన్న, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య, సీఐ జానయ్య, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షించారు. కేపీహెచ్బీ కాలనీలో పలు రోడ్లపై ఫుట్పాత్ ఆక్రమణలను గుర్తించామని, వారికి ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే తొలగించామని చెప్పారు. కేపీహెచ్బీ కాలనీతో పాటు అన్ని రోడ్లపై త్వరలోనే ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించే ప్రక్రియ నిరంతరాయం కొనసాగుతుందని స్పష్టంచేశారు.