హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : తమను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదంటూ పాడిరైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్కారుపై పోరుకు దిగిన రైతులు ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ధర్నాకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం జంకినట్టు కనిపిస్తున్నది. ధర్నాను తాత్కాలికంగా ఆపే ప్రయత్నాల్లో భాగంగా బకాయిలు విడుదల చేసింది. రూ. 50 కోట్ల బకాయిలు విడుదలైనట్టు డెయిరీ ఎండీ లక్ష్మి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మొత్తం మంగళవారం రైతుల ఖాతాల్లో జమవుతుందని వెల్లడించారు. ఇక రైతులెవరూ ఆందోళన చేయొద్దని, సంయమనం పాటించాలని కోరారు.
మార్కెట్ ధర కన్నా ఎక్కువ రేటు చెల్లిస్తున్నామని, మిగిలిన బకాయిలను త్వరగా చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ధర్నా చేయకుండా అడ్డుకునేందుకు ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తం బకాయిలు రూ.150 కోట్లకు పైగా ఉంటే కేవలం రూ.50 కోట్లు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తమను తప్పుదోవ పట్టించేందుకేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 50 కోట్లు విడుదల చేసినట్టు వచ్చిన ప్రకటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనపై అధికారుల సంతకం లేదని చెప్తున్నారు. రూ.50 కోట్లను మంగళవారం చెల్లిస్తామన్న ప్రకారం చెల్లించాలని, లేకుంటే మోసపూరిత కుట్రగానే భావించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు.