రవీంద్రభారతి, అక్టోబర్ 23: 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 27 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీసీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో వివిధ పార్టీలు, సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు. బీసీలు తామెంతో తమకంత వాటా పొందేవరకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కొన్ని అగ్రకులాలు బీసీల మధ్య చిచ్చుపెట్టి ఐక్యంకాకుండా కుట్రలు చేస్తున్నాయని, ఆ కుట్రలను బీసీలు తిప్పికొట్టి బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కోరారు. బీసీలు ఐక్యపోరాటాలతో రాజ్యాధికారం వైపు పయనించాలని చెప్పారు. అన్ని వెనుకబడిన కులాలను బీసీ ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తేవాలని కోరారు. కొన్నివర్గాలు అణగారిన వర్గాలైన బీసీలు రాజ్యాధికార ఫలాలను అనుభవించకుండా అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో చేర్చడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ చెప్పారు. సమావేశంలో బీసీ నేతలు డాక్టర్ వినయ్‌కుమార్, శివశంకర్, దాసురామ్నాయక్, పీ సాయిబాబా, కే నర్సింగ్‌రావు, కోసిగి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్‌యాదవ్, వంశీకృష్ణ, నాగుల శ్రీనివాస్‌యాదవ్, శారదాగౌడ్, శైలజ, జయంతి పాల్గొన్నారు.