Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా అన్ని రకాల నేరాలు పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్‌పై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, రేంజ్ ఐజీలు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీంలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురైన వారు అందించే ప్రతీ ఫిర్యాదుపై కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేరాల నమోదు నిర్దారిత ప్రమాణాలలోనే ఉన్నాయని, వ్యక్తిగత నేరాలు మినహా మిగిలిన నేరాలన్నింటిలోనూ తగ్గుదల ఉందని తెలిపారు. డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఏక్సలెన్సీ చేసిన సమీక్ష అనుసరించి రాష్ట్రంలోని మొత్తం 700 పోలీస్ స్టేషన్లలో 330 పోలీస్ స్టేషన్లు అద్భుతమైన పని తీరును కనబర్చాయని పేర్కొన్నారు. ఇదే విధమైన ఉత్తమ సేవలందించేందుకై మిగిలిన పోలీస్ స్టేషన్ల పనితీరును రెగ్యులర్‌గా సమీక్షించాలని సీపీలు, ఎస్పీలను ఆదేశించారు. బ్లూ కోట్స్ పనితీరు అంశంలో ఉత్తమ పనితీరును కనబరిచిన పలు కమిషనరేట్లను, ఎస్పీలను డీజీపీ అభినందించారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు.
సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల పోక్సో కేసు విషయంలో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి నిందితునికి 20 ఏండ్ల శిక్ష, నగదు జరిమానా విధించడంతో కృషి చేసిన దర్యాప్తు అధికారులు ప్రతాప్ రెడ్డి, బంజారాహిల్స్ ఎస్‌హెచ్‌వో నరేందర్‌లను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. వీరికి పుష్పగుచ్చంతో పాటు ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడడంలో కృషి చేసిన అడిషనల్ డీసీపీ శివ కుమార్, ఎస్‌హెచ్‌వో నరేందర్ గౌడ్లను డీజీపీ సన్మానించారు. అదేవిధంగా శివ సాగర్ అనే నిందితుడిని 18 ఏండ్ల తర్వాత అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్లు వెంకటేష్, శ్రీనివాస్, ఎస్పీ రాంరెడ్డిలను కూడా డీజీపీ సన్మానించారు.