Gangadhara | గంగాధర, మార్చి 24 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. నిరుడులాగే నీళ్లొస్తాయని సాగు చేసిన రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో కరువన్నదే ఎరుగరు. గలగలా పారే వరదకాలువలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో మోటర్లు పైకి తేలాయి. పంటలను కాపాడుకోవడానికి వరదకాలువలో గుంతలు తవ్వి నీరందిస్తున్నారు.
28 కి.మీ. కాలువ…
గంగాధర మండలంలో 12 గ్రామాలను తాకుతూ దాదాపు 28 కిలోమీటర్ల మేర వరద కాలువ విస్తరించి ఉంది. దీనిపై ఆధారపడి దాదాపు 15 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌజ్ నుంచి నీటిని వరదకాలువకు విడుదల చేయడంతో జీవనదిలా మారింది. దీంతో ఆయా గ్రామాల రైతులు వరదకాలువలో మోటర్లు వేసుకుని పంటలకు నీరు అందించుకునేవారు. ఏడాది పొడవునా వరదకాలువలో నీరు ఉండడంతో ఐదేండ్లుగా వర్షాల కోసం ఎదురుచూడకుండా రైతులు పంటలు సాగు చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది.
యాసంగి సాగు చేసిన రైతులు పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరదకాలువలో గోతులు తవ్వి అందులో మోటర్లు పెట్టి పంటలకు సాగు నీరు అందిస్తున్నారు. మోటర్ పంపుసెట్టుకు నీరు అందకపోవడంతో అదనంగా పైపులు వేస్తూ నీటిని పారించడానికి ప్రయత్నిస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఇలాగే కొనసాగితే పరిస్థితి చెయ్యిదాటి పోతుందని, పంటలు చేతికివచ్చే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీళ్లు ఉంటేనే పంట
ఐదేండ్లుగా వ్యవసాయానికి నీటి కరువు చూడలేదు. ఏడాది పొడవునా వరదకాలువలో నీరు ఉంది. ఇప్పుడు కాలువల నీళ్లు తగ్గి గుంతలు తవ్వి, పైపులు ఎక్కువ వేసి పొలానికి నీళ్లు పారించుకుంటున్నాం. ఇంకో పది రోజులు నీళ్లు ఉంటే బయట పడుతం. లేదంటే పంట చేతికి వచ్చుడు కష్టమే.
– తొర్రికొండ కిషన్, కొండన్నపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా
గుంతలు తవ్వుతున్నం
మాకున్న రెండెకరాల్లో వరి పంట సాగు చేసిన. వరదకాలువలో గుంతలు తవ్వి పొలానికి నీళ్లు పారిచ్చుడు అయితంది. ఐదేండ్లలో ఒక్కసారి కూడా వరదకాలువలకు దిగలేదు. ఇప్పుడు మోటర్లు పైకి తేలినయి. నీళ్లు అందక పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని కాలువలకు దిగి, గుంతలు తవ్వి నీళ్లు పెడుతున్నం.
– దూస సతీశ్, కొండన్నపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా