హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రావాల్సిన డబ్బులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని శాఖల్లోనూ ఏటా భారీగా వచ్చే ఆదాయం.. క్రమంగా తగ్గిపోతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ వసూళ్లు తగ్గిన శాఖల్లో ట్రాన్స్పోర్ట్ కూడా చేరింది. రాష్ట్ర రవాణాశాఖలో గతంతో పోల్చితే ఈసారి భారీగా వసూళ్లు తగ్గాయి. కరోనా కాలంలో 20 20-21 తర్వాత మళ్లీ భారీగా తగ్గింది. 2023-2024తో రూ. 6,690.22 కోట్ల ఆదాయం రాగా, 2024-25లో కేవలం రూ.5,787.96 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతంతో పోల్చితే రూ.1,203 కోట్ల రాబడి తగ్గింది. రాష్ట్ర రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు జారీ చేయడం, పన్ను వసూళ్లు చేయడం, వాహనాలు ఉల్లంఘనలను నియంత్రించడానికి ఫైన్లు వేయడం వాటితో ఆదాయం సమకూరుతుంది. తెలంగాణలో 1.72 కోట్ల వాహనాలు రిజిస్టరై ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రవాణాశాఖ ద్వారా 2025 జనవరి వరకు రూ.5,787.96 కోట్ల మొత్తాన్ని మాత్రమే వసూలు చేశారు.