హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పెరిగిన జనాభాకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సింది పోయి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది బడ్జెట్లో తగ్గించి చిన్నచూపు ప్రదర్శించింది. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ కేటాయింపుల కంటే రూ.1,600 కోట్లు తక్కువగా ప్రతిపాదించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ శాఖ పట్ల వివక్షను చాటుకున్నది. ఆసరా పింఛన్ సొమ్మును రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంపు, మహిళలకు నెలనెలా 2,500 ఆర్థికసాయం హామీలకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయపోవడంతో ఆ హామీలపై ఉస్సూరుమనిపించారనిపిస్తున్నది. దాదాపు 10 లక్షల మందికి కొత్త పింఛన్లకూ ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేయలేదు. వడ్డీలేని రుణాలకు రూ.1,302 కోట్లు కేటాయించగా, మహిళలకు రూ.20 వేల కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అటు.. బడ్జెట్లో మున్సిపల్ శాఖకు స్వల్పంగానే కేటాయింపులను పెంచారు. 2022-23లో రూ.8,029 కోట్లు, 2023-24లో రూ.11,372 కోట్లు కేటాయించగా, 2024-25లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,594 కోట్లే కేటాయించింది.