హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కుంభవృష్టి ముంచెత్తింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలోఅల్పపీడనం, అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పలుజిల్లాల్లో జోరుగా వానలు కురిశాయి. 33 జిల్లాల పరిధిలోని 621మండలాల్లో మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ముఖ్యంగా మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయని తెలిపింది. మంచిర్యాలలోని భీమినిలో అత్యధికంగా 23.26 సెం.మీ, కన్నెపల్లిలో 20.38 సెం.మీ అత్యంత భారీవర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. నల్లగొండ, నాగర్‌కర్నూల్, గద్వాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో కూడా భారీవర్షాలు కురిశాయి. శ్రీరాంపూర్, మందమర్రి, ఇందారం, ఖైరీగూడ సింగరేణి ఓపెన్కాస్ట్లోకి వరద నీరు చేరింది.
దీంతో 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి ఆగిన వాన.. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసింది. మళ్లీ సాయంత్రం 4గంటల నుంచి పలు ప్రాంతాల్లో మొదలైంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి.
లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లల్లోకి నీరు చేరి జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పంట పొలాలు వరదలతో మునిగిపోయి, ఇసుక మేటలు వేశాయి. పలు జిల్లాల్లో లింక్‌రోడ్లు తెగిపోయి.. రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నగర ప్రజలు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు ఒక్కపూటనే నిర్వహించాయి. ఐటీ ఉద్యోగులకు యాజమాన్యాలు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాయి. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల, వైద్యారోగ్యశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ ఆదేశించారు. సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను చెప్పారు.
టీకా కోసం వాగుదాటి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాసిగడ్డతండాకు చెందిన రజిత ఒడితెల సబ్సెంటర్లో తన మనుమరాలికి టీకా వేయించేందుకు ఉధృతంగా ప్రవహిస్తున్న కొండెంగల ఒర్రె దాటి వెళ్లాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి యమునను పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో వాగు దాటించి, బెల్లంపల్లి దవాఖానకు తరలించారు.
విమానాల దారి మళ్లింపు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 11 విమానాలను విజయవాడ, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లకు తరలించారు. మధ్యా హ్నం వాతావరణం అనుకూలంగా మారడంతో తిరిగి శంషాబాద్ తీసుకొచ్చారు.
నిండుకుండల్లా జలాశయాలు
ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి నదుల్లోకి వరద పోటెత్తుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి 19,062 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్ట్ నుంచి 11,374 క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ఏరియా నుంచి కొంత నీరు వస్తున్నది. బుధవారం నాటికి 13.7124 టీఎంసీల నీరు వచ్చింది. ఆసిఫాబాద్ జిల్లాలోని అడ (కుమ్రంభీం) ప్రాజెక్ట్‌కు భారీ వరద వచ్చి చేరుతున్నది. ఐదు గేట్లను ఎత్తి 21254 క్యూసెకుల నీటిని దిగువకు వదిలారు. గుండాల జలపాతం 60 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే పాల నురగల్లాంటి ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి భారీగా వరద పోటెత్తింది. వరద ప్రమాదకరంగా పారుతున్నది. దీంతో అధికారులు పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు.
రెడ్ అలర్ట్
మరో రెండు రోజులపాటు రాష్ర్టానికి వానగండం పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం మరింత స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారుతుందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం ప్రాంతానికి చేరుకునే అవకాశముందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు మరోసారి రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. నేడు(గురువారం) కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ప్రకటించింది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. శుక్రవారం మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు రెడ్ అలర్ట్ పరిధిలో ఉంటాయని పేర్కొంది.
పలు జిల్లాలో బడులకు సెలవు
భారీవర్షాల నేపథ్యంలో నేడు (గురువారం) పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్ర భుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేర కు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులు ప్రకటించిన జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, వరంగల్, భువనగిరి ఉన్నాయి.
పెండ్లి కొడుక్కు వరద అడ్డంకి
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలోని ఊర చెరువు ఉప్పొంగుతుండగా, కల్వర్టు వద్ద వరద ఉధృతితో ఓ పెండ్లి కొడుకు అవస్థలు పడ్డాడు. ఊర చెరువు మత్తడి కల్వర్టు మీదుగా పొంగి పొర్లుతుండడంతో గ్రామంలోకి వెళ్లడం కష్టమైంది. ముహూ ర్త సమ యం దగ్గర పడుతుండడంతో పెళ్లికొడుకును స్థానికులు, బంధువులు విధిలేని పరిస్థితిలో భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకెళ్లారు.
అధిగమించిన సాధారణ లోటు వర్షపాతం
4%అధికంగా 471.7 మి.మీ నమోదైన వర్షపాతం