హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చక్రవాత ఆవర్తనం, క్యుమిలోనింబస్ మేఘాల వల్ల గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వివరించింది. గురువారం సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో, శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో సాధారణకంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొన్నది.