Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): పరిమితికి లోబడి అప్పులు తీసుకొంటూ ఆర్థిక క్రమశిక్షణను పాటించిన రాష్ర్టాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పక్కాప్రణాళికతో వినియోగించుకొని అభివృద్ధికి బాటలు వేసిన రాష్ర్టాల జాబితాలోనూ తెలంగాణ ముందువరుసలో నిలిచింది. కేసీఆర్ పాలనలో 2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోని అన్ని రాష్ర్టాల ఆర్థిక నిర్వహణ సూచీలో తెలంగాణ అగ్రస్థానాన్ని సాధించింది. ఈ మేరకు ప్రఖ్యాత జర్నల్ ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ (ఈపీడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించింది.
దేశంలో అప్పులు తీసుకోవడంలో ఆర్థిక క్రమశిక్షణను పాటించిన రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు ఈపీడబ్ల్యూ తన తాజా సూచీలో వెల్లడించింది. 0.595 మార్కులతో తెలంగాణ ఈ జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఒడిశా 0.669 మార్కులతో తొలి స్థానంలో నిలిచింది. గడిచిన పదేండ్లలో తెలంగాణలో చేపట్టినన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులు మరే ఇతర రాష్ట్రంలోనూ చేపట్టలేదు. ఒడిశా విషయానికొస్తే, గడిచిన పదేండ్లలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టును కూడా ఆ రాష్ట్రం చేపట్టినట్టు రికార్డుల్లో లేదు. అయినప్పటికీ, ఆ రాష్ట్రం అప్పులు చేసింది. ఈ లెక్కన విశ్లేషిస్తే రుణాల నిర్వహణ సూచీలో తెలంగాణే మొదటి ర్యాంకులో ఉన్నట్టు అర్థమవుతున్నది. పెద్దరాష్ర్టాలుగా చెప్పుకొనే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లు ఈ జాబితాలో వరుసగా 8, 9, 10వ స్థానానికి పరిమితంకావడం గమనార్హం.
రెవెన్యూ రాబడులు, వ్యయాలు, ఆర్థిక లోటు, అప్పులతో పాటు అంతగా ప్రాధాన్యంలేని ప్రాజెక్టులపై ఖర్చులను తగ్గించుకొని రాష్ర్టాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ అందుబాటులో ఉన్న అన్ని వనరులను పక్కాప్రణాళికతో వినియోగించుకొనే రాష్ర్టాల జాబితాలోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈపీడ్ల్యూ సూచీ ప్రకారం ఈ అంశంలో తెలంగాణ 0.813 మార్కులతో రెండోస్థానంలో ఉండగా, 0.970 మార్కులతో గోవా తొలిస్థానంలో నిలిచింది. వనరుల వినియోగంలో పర్యాటకం కూడా వస్తుంది. గోవా మొత్తం జనాభా 15 లక్షలుగా ఉంటే, ఏటా ఈ రాష్ర్టానికి వచ్చే పర్యాటకులు 80 లక్షల మందివరకూ ఉంటారు. దీన్నిబట్టి విశ్లేషిస్తే, పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం వల్లనే గోవా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే, ఈ సూచీలోనూ తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమించేది. కేసీఆర్ హయాంలో రాష్ర్టానిక రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకున్నా.. స్వశక్తితో నిధులను సమకూర్చుకొన్నది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలో సొంత పన్నుల వార్షిక సగటు వృద్ధిరేటు 12 శాతం కంటే ఎక్కువగానే నమోదైంది. ఇది దేశంలోని ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే అత్యధికం. తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డు సృష్టించింది. పదేండ్ల వ్యవధిలో బడ్జెట్లో మూలధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన పదేండ్లలో ఏడేండ్లూ మిగులు బడ్జెట్‌నే నమోదు చేసింది. వ్యవసాయరంగంలో మౌలిక వసతుల కల్పన, 24 గంటల తాగునీరు, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసిన రాష్ట్రంగానూ తెలంగాణ కొత్త రికార్డులను సృష్టించింది. పరిశ్రమల స్థాపన, ఐటీ ఎగుమతులు, ఉద్యోగకల్పన.. ఇలా దాదాపు డజను రంగాల్లో తెలంగాణ మిగతా రాష్ర్టాల కంటే ఎంతో పురోగతి సాధించింది.
2014 నుంచి 2023కు గానూ దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ప్రభుత్వాల వ్యయ నియంత్రణ చర్యలు, అభివృద్ధి పనులు ఇలా పలు అంశాలు ఏవిధంగా ఉన్నాయన్న వాటిపై ఆర్థిక నిపుణులు గోవింద్ భట్టాచార్య, మేఘనా అగర్వాల్ నేతృత్వంలోని బృందంతో ఈపీడబ్ల్యూ సంపాదకీయవర్గం సమగ్ర సర్వే నిర్వహించింది. అలా సేకరించిన పలు విషయాలను ‘పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బై ఇండియన్ స్టేట్స్’ సూచీ పేరిట ఈ నెల 19న ఓ నివేదిక వెలువరించింది. ఇందులో రెండు ప్రధాన అంశాలైన రుణాలు, వనరులపై నిపుణులు దృష్టిసారించారు. ఆ రెండింట్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
నివేదిక పేరు: రాష్ర్టాల ఆర్థిక నిర్వహణ సూచీ
కాలవ్యవధి: 2014-2023
సర్వే సంస్థ: ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఈపీడబ్ల్యూ)
అధ్యయనకారులు: గోవింద్ భట్టాచార్య, మేఘనా అగర్వాల్ బృందం
పరిగణలోకి తీసుకొన్న అంశాలు: రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులు, అప్పులు, వ్యయ నియంత్రణ చర్యలు, అభివృద్ధి పనులు
అప్పుల నిర్వహణలో తెలంగాణ ర్యాంక్ 2 (0.595 మార్కులు)
వనరుల నిర్వహణలో తెలంగాణ ర్యాంక్ 2 (0.813 మార్కులు)