హైదరాబాద్: రైతు సంక్షేమం గురించి చర్చించేందుకు తెలంగాణలో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 72 గంటల్లో రా.. తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని చెప్పారు. చర్చకు మూడు రోజుల సమయం ఇస్తున్నామని, ప్రిపేర్ అయ్యి రావాలన్నారు. లేదంటే చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతుందని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్ఎస్. నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్ రెడ్డి. సభ పెడితే బూతులు మాట్లాడుడే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు. రైతు సంక్షేమంపై రేవంత్ రెడ్డి ఎక్కడ చర్చ పెట్టినా మేం రెడీ. 72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రిపేర్ అయ్యి చర్చకు రండి. రేవంత్ రెడ్డికి బేసిన్ తెలవదు, బెండకాయ తెల్వదు. దేవాదుల గోదావరి బేసిన్లో ఉందా అని అడుగుతడు. నల్లమల పులి అంటాడు.. మళ్లీ నల్లమల తెలంగాణలోనే ఉందా అని అంటడు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదు. 70 లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రైతుకు పెట్టుబడి, ఉచిత విద్యుత్, వాగులు నిపింన ఘనత కూడా కేసీఆర్‌దే. రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చెరువులను ధ్వంసం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోశాం. రూ.30 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించాం. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చింది కేసీఆర్ కాదా?. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగానికి కేసీఆర్ చేసినంత ఎవరూ చేయలేదు. ఎరువుల పంపిణీ చేతకాని మీరు.. కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా?.
యూరియా కోసం రైతులు అష్టకష్ఠాలు పడుతున్నారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులు పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు ఎరువల కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఆధార్ కార్డు చూపిస్తే రైతుకు ఒక బస్తా యూరియా ఇవ్వాలని ఆదేశించారు. రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది రేవంత్ రెడ్డి కాదా. వాగులు, వంకలు నింపిన ఘనత కేసీఆర్‌ది. బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బీమా తీసుకొచ్చారు. ఆ రైతు బీమాను ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి కాదా?. కేసీఆర్ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చారు. కిందికి నీళ్లను తీసుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు హారతలు పట్టారు. గోదావరి, కృష్ణా నీటిని ఒడిసిపట్టి కోటి ఎకరాల మాగాణం చేసింది కేసీఆర్ కాదా?. ఇదంతా తెలంగాణ రైతాంగానికి తెలియదా. మీ గురువు చంద్రబాబు బనకచర్ల ద్వారా నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నదెవరో ప్రజలకు తెలియదా. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించింది కేసీఆర్ కాదా. రెండు దఫాలుగా కేసీఆర్ రైతు రుణమాఫీ చేశారు. కరోనా, నోట్ల రద్దును తట్టుకుని రూ.34 వేల కోట్ల రుణమాఫీ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఒక్కడైనా అమలు చేశారా. ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు.. చేశారా?. రేవంత్ రెడ్డి ఎక్కడ చర్చకు రావాలో ప్లేస్, డేట్ చెప్పు.. నువ్వు పారిపోతే మేం టైమ్, ప్లేస్ చెబుతున్నాం.. చర్చకు రా. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 8 తారీఖునాడు చర్చకు సిద్ధం. ఉదయం 11 గంటలకు సమయం ఇస్తున్నాం. వస్తవా.. పారిపోతావో నువ్వే తేల్చుకో. నాలుగు పంటలకు రైతుభరోసా ఎగ్గొట్టి పండుగ చేసుకోమంటున్నవు. రైతు భరోసాకు రూ.15 వేలు ఇస్తున్నవా?. కౌలు రైతులకు లేఖలు రాసి ఇప్పుడెందుకు పైసలు ఇస్తలేవు?. రైతు బంధులో మొత్తం రూ.39 వేల కోట్లు ఎగ్గట్టారు. మొదటి విడుతలో రూ.15 వేలు అని చెప్పి రూ.10 వేలే వేశారు. ఎన్నికల వరకే రైతుభరోసా ఇస్తాడు. తర్వాత మొత్తం బంద్ పెడుతారు. ఒక్కో రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.19 వేలు బాకీ ఉంది. రైతు రుణమాఫీ రూ.12 వేల కోట్లు మాత్రమే చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వలేదు. 30 శాతం వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు.
కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఉద్యోగ ప్రక్రియకు అపాయింట్మెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్, రేవంత్ రెడ్డి చర్చకు రావాలి. రూ.2500 కోసం కోటీ 40 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. స్కూటీల కోసం విద్యార్థినిలు ఎదురు చూస్తున్నరు. రేవంత్ రెడ్డి తెలంగాణను పే సీఎం.. పే ఢిల్లీ ఏటీఎంగా మార్చిండు’ అని కేటీఆర్ అన్నారు.