పీర్జాదిగూడ, ఆగస్టు 4: వరంగల్ జాతీయ రహదారిలో మేడిపల్లి నుంచి అంబర్‌పేట వెళ్లే కారిడార్ రోడ్డు పనులను దసరాలోపు పూర్తి చేస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. పీర్జాదిగూడలో జాప్యంగా జరుగుతున్న కారిడార్ రోడ్డు పనులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, బీర్ల అయిలయ్య, పీర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు అజయ్ యాదవ్, జక్క వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మేడిపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 15న కారిడార్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కారిడార్ పనులను సీఎం రేవంత్‌రెడ్డి త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 72నెలల్లో చేయలేని పనులకు రీ టెండర్లు పిలిచి అక్టోబర్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 18 నెలల్లో కారిడార్ పనులను పూర్తి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఈ పనులకు సుమారు రూ. 300 కోట్ల వరకు వ్యయం పెరుగుతుందని తెలిపారు. మూసీనది అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రపంచ బ్యాంక్ నిధులతో మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆలేరు వరకు ఇరుపక్కల జరిగే రోడ్డు పనులను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జిల్లా నాయకులు తోటకూర వజ్రేశ్‌యాదవ్, ఆర్అండ్బీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.