Rayalaseema Project | (నీంకార్ వెంకటేశ్వర్రావు) మహబూబ్‌నగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ బ్యాక్‌వాటర్‌ను పూర్తిస్థాయిలో తరలించుకుపోయేలా రూ.3,825 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇదే జరిగితే నాగార్జునసాగర్‌కు చుక్కనీరు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర ముప్పుతోపాటు తెలంగాణకు కృష్ణా నది నీళ్లు ఇక గగనమే అని అనిపిస్తున్నది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులమడుగు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ‘నమస్తే తెలంగాణ’ బృందం పరిశీలించింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సంగమేశ్వర ఆలయం సమీపం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తవ్వుతున్న కాల్వ ప్రాంతాన్ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3,825 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎండాకాలంలోనూ రాయలసీమకు నీటిని తరలించాలన్న ఉద్దేశంగా తెలుస్తోంది.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 111 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రతిపాదించారు. పంప్‌హౌస్ కోసం ఏకంగా కృష్ణానది తీరప్రాంతంలో లోతైన అప్రోచ్ కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా 12 సొరంగాల నుంచి సుమారు 300 మీటర్ల దూరంలోని పంప్‌హౌస్‌కు నీళ్లు వెళ్తాయి. అప్రోచ్ కెనాల్ కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సంగమేశ్వర ఆలయం వద్ద మొదలు పెట్టి నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులమడుగు గ్రామం వరకు 18 కి.మీ. అప్రోచ్ కెనాల్‌ను నిర్మిస్తున్నది. ఇప్పటికే కృష్ణానదిలో ఏపీ వైపు ఐదు కిలోమీటర్ల మేర కాల్వ తవ్వకం పూర్తయినట్టు తెలుస్తున్నది.
ఓ వైపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మిస్తూనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి మరో కెనాల్‌ను తవ్వేశారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు వద్ద 15 టీఎంసీల నీటిని తరలించేందుకు తెలుగుగంగ కాల్వను ఏర్పాటు చేయగా.. మద్రాస్‌కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ కాల్వ పక్కనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచి 10 గేట్ల ద్వారా మరో 18 వందల క్యూసెక్కుల నీటికి కాల్వ ఏర్పాటు చేసి తరలిస్తున్నది.
ఇవి రెండు కాల్వలు ఉండంగానే మరో కాల్వను నది లోపలి నుంచి తవ్వి పోతిరెడ్డిపాడుకు జనవరి చివరి వరకు నీళ్లు అందించేందుకు సిద్ధం చేసిం ది. కృష్ణా నదిలో నీరు రావడం ప్రారంభమైన నుంచి డిసెంబర్ వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని యథేచ్ఛగా తరలిస్తున్నది. తాజాగా జనవరి చివరి వరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి నీరు అందించే విధంగా మరో కాల్వను సిద్ధం చేయడం గమనార్హం. పోతిరెడ్డిపాడు విస్తరణపై గతంలోనే తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన అప్పటి వైఎస్ ప్రభుత్వం దీన్ని తుంగలో తొక్కి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను భారీ ఎత్తున విస్తరించింది.
కృష్ణా నదికి ఏపీ వైపున హంద్రీనీవా, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ కాల్వతోపాటు తాజాగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 111 టీఎంసీలు గ్రావిటీ ద్వారా తరలించకపోయేందుకు ఈ పథకాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణా నదికి ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు జూన్ రెండో వారం నుంచి వరద మొదలవుతుంది. ఈ సమయంలో ఏపీ తమ వైపు ఉన్న ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి సమాచారం లేకుండా నీటి తరలింపు ప్రారంభిస్తున్నది.
శ్రీశైలం నిండితే నీటి తరలింపునకు ఢోకా ఉండదు. ఎండాకాలంలో శ్రీశైలం నీటిమట్టం తగ్గుముఖం పడుతుంది. 854 మీటర్ల కనిష్ఠ మట్టానికి చేరినప్పుడు ఈ పథకాలకు నీళ్లు ఆగిపోతాయి. 854 అడుగుల మేర శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ నీళ్లను తోడుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఇది పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఇక నాగార్జునసాగర్‌కు తరలించడం కూడా అసాధ్యమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి ఏకంగా న్యాయపోరాటానికి దిగింది.
పర్యావరణ అనుమతులు లేనిది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టొద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కొన్ని రోజులు పని ఆపిన ఏపీ ప్రభుత్వం.. ఆ తర్వాత నిరాటకంగా కొనసాగిస్తున్నది. ఎన్జీటీ తీర్పు నాటికి 14శాతం పనులు మాత్రమే పూర్తయితే.. 2024 మార్చి, ఏప్రిల్ వరకు దాదాపు 87 శాతం పనులు పూర్తి కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలతో ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. పర్యావరణ అటవీ అనుమతులు లేనిదే నిర్మించినందుకు రూ. 2.65 కోట్ల ఫెనాల్టీ ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాకుండా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులతో పాటు ఇతర స్టాట్యూరీ పోస్ట్ ఫాక్టో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది.
ఇటు తెలంగాణలో అటు ఏపీలోనూ ప్రభుత్వాలు మారడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇక అడ్డూ.. అదుపు ఉండదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు పెట్టకపోవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి బలం చేకూరుస్తూ సొంత జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పెట్టి పనులను ఎక్కడికి అక్కడే నిలిపివేసి.. బడ్జెట్లో చిల్లిగవ్వ కేటాయించకుండా చూడటం వెనుక ఉద్దేశం ఇదేనని అంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చని భావిస్తున్నారు. తన గురువు చంద్రబాబు కోసం శిష్యుడైన రేవంత్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.